తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. నేడు రాజంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇవి కామారెడ్డి భవిష్యత్తును మార్చే ఎన్నికలు అని అన్నారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలు, బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది అని, పదేళ్లుగా గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు రేవంత్ రెడ్డి. గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయలేదని, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కేసీఆర్ భర్తీ చేయలేదు.. నిరుద్యోగ సమస్యను తీర్చలేదన్నారు రేవంత్ రెడ్డి. రైతుల భూములను మింగేందుకే కేసీఆర్ కామారెడ్డికి వచ్చిండని, మన భూములు మన చేతిలో ఉండాలంటే ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను బండకేసి కొట్టాలన్నారు రేవంత్ రెడ్డి.
అంతేకాకుండా.. ‘కేసీఆర్ కు ఓటు వేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే… కేసీఆర్ కాలనాగులాంటి వారు. కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ వీధి కుక్కలా… ఆయన కొడుకు ఒక పిచ్చి కుక్కలా మారారు. రైతుల భూములను కాపాడేందుకే నేను కామారెడ్డిలో పోటీ చెస్తున్నా… మీ కోసం కొట్లాడుతా… గుంట భూమి గుంజుకోకుండా కంచె వేసి కాపాడుతా.. ఓటుకు పది వేలు ఇచ్చి గెలవాలని కేసీఆర్ చూస్తున్నారు… కామారెడ్డిలో రూ.200 కోట్లు ఖర్చు పెట్టి… రూ.2000 కోట్ల భూములను గుంజుకోవాలని చూస్తుండు.. తెలంగాణను దోచుకున్న దొంగ కేసీఆర్ ను ఓడించి బుద్ది చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు అందిస్తాం. కేసీఆర్ ఉంటే పెన్షన్ రూ.2వేలే.. కేసీఆర్ ను బొందపెడితే రూ.4వేలు పెన్షన్. రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తాం. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.