పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని.. రేషన్ కార్డుకు సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కుటుంబాన్ని నిర్ధరించేందుకే రేషన్ కార్డు అన్నారు. రుణాలు తీసుకున్న దాదాపు 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవని ఆయన తెలిపారు. అందుకే పాస్‌బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు. గురువారం సాయంత్రం సచివాలయంలో తొలివిడత రుణమాఫీ ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా రూ.1 లక్ష లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని.. కాంగ్రెస్ మాటే శిలాశాసనమని మరోసారి రుజువైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మొత్తం 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. ఆర్థికశాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసింది.
READ MORE:Viral video: కారు రన్నింగ్‌లో ఉండగా మహిళలు డ్యాన్సులు.. పోలీసులు ఏం చేశారంటే..!
వరంగల్ జిల్లాకు చెందిన ఓ రైతుతో మాట్లాడారు. ఈ సందర్భంగా మరోసారి వరంగల్ జిల్లాలో రైతులతో సభ నిర్వహిద్దామా..? అని రైతును సీఎం అడిగారు. మీరు ఒప్పుకుంటే మరోసారి రాహుల్ గాంధీని కలిసి త్వరలో అయిదు లక్షల మంది రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేద్దామని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ అమలు చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేసిందని ముఖ్యమంత్రి అన్నారు. రుణమాఫీ పథకం సరిగా అమలు చేయలేదన్నారు. డిక్లరేషన్‌లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు. హామీ మేరకు ఈ నెలా చివరి కల్లా నాటికి రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని మరోసారి గుర్తు చేశారు. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు అప్పులు చేసిందని.. దీనికి ప్రతి నెలా రూ.7వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. జీతాలు, పింఛన్ల కోసం రూ.5వేల కోట్లు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే వివిధ పథకాల కోసం రూ.29 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. మొత్తం మూడు విడతల్లో రూ.31 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రైతులకు తీపి కబురు చెప్పారు. అనంతరం పలువురు రైతులకు చెక్కులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించిన నమూనా చెక్కును విడుదల చేశారు.