Site icon NTV Telugu

CM Revanth Reddy : నేడు ఖర్గేతో భేటీకానున్న సీఎం రేవంత్‌.. కొత్తమంత్రులకు శాఖల కేటాయింపు నిర్ణయం

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించే విషయంలో తడబడుతున్న ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకు శాఖల కేటాయింపుపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. అధిష్టానం కీలక నేతలైన కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో ఆయన సమావేశమై మంత్రుల శాఖలపై చర్చించినట్టు తెలుస్తోంది.

Tamil Nadu: అన్నామలై ఆలయంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి.. తీవ్ర ఉద్రిక్తత!

సాధారణంగా ప్రమాణ స్వీకారం తర్వాత కొన్ని గంటల్లో మంత్రులకు శాఖలు కేటాయిస్తూ గవర్నర్ గెజిట్ విడుదలవుతుంటుంది. కానీ ఈసారి ఆలస్యం జరుగుతోంది. ఇందుకు ముఖ్య కారణం శాఖల విషయంలో అధిష్టానం నేరుగా జోక్యం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం వద్ద హోం, మున్సిపల్, విద్య, సామాజిక సంక్షేమ, మైనారిటీ సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనింగ్, కార్మిక, పశుసంవర్ధక, యువజన సేవలు, కమర్షియల్ టాక్స్, న్యాయ శాఖలు ఉన్నాయి. వీటిలో కొన్ని శాఖలను కొత్త మంత్రులకు అప్పగించే విషయమై రేవంత్ రెడ్డి తన ప్రతిపాదనలు అధిష్టానానికి వివరించినట్టు సమాచారం.

మరోవైపు, కొంతకాలంగా శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న పాత మంత్రుల్లో కొందరు కీలకమైన హోంశాఖను కోరుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ వంటి నేతలు శాఖ మార్పును కోరినట్టు సమాచారం. మున్సిపల్ శాఖపై కూడా పలువురు మంత్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ శాఖల మార్పులు వల్ల పాత మంత్రుల అసంతృప్తి తలెత్తే అవకాశముందని అధిష్టానం పరిశీలించినట్టు తెలిసింది. అందువల్ల మంత్రుల మధ్య సమతుల్యత పాటించేలా సమన్వయం చేసేందుకు హైకమాండ్ రేవంత్‌ను ఢిల్లీకి పిలిపించిందని అంటున్నారు.

US: అమానుషం.. భారతీయ విద్యార్థికి బేడీలు.. వీడియో వైరల్

ఇక, మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి వంటి నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జరిగే కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ హామీ వల్లే వారు అసంతృప్తిని బయటపెట్టలేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో మంగళవారం రేవంత్ రెడ్డి ఖర్గేతో మరోసారి సమావేశమై శాఖల కేటాయింపు విషయంపై తుది చర్చలు జరపనున్నారు. అనంతరం ఖర్గే ఆమోదంతో మంత్రుల శాఖల ప్రకటన వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది.

Exit mobile version