Academy Awards: సినిమా కన్ను తెరచింది ఫ్రెంచ్ దేశంలో అయినా, చలనచిత్రాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత నిస్సందేహంగా అమెరికాకే దక్కుతుంది. మొదటి నుంచీ సినిమాను, అందుకు సంబంధించిన విభాగాలనూ అమెరికా ప్రోత్సహిస్తూ వచ్చింది. అందులో భాగంగానే 1929 మే 16న ఆస్కార్ అవార్డులుగా జగద్విఖ్యాతి గాంచిన ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ను ఏర్పాటు చేసింది. ఆరంభంలో ఈ అకాడమీ అవార్డులు అమెరికా, బ్రిటన్ లో రూపొందిన చలనచిత్రాలకే పరిమితం. తరువాత ప్రపంచంలోని ఇతర దేశాల చిత్రాలనూ ప్రోత్సహించే దిశగా అడుగులు సాగాయి. ‘బెస్ట్ ఫారిన్ మూవీ’ అనే కేటగిరీని ఏర్పాటు చేశారు. అదే ప్రస్తుతం ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిమ్’ విభాగంగా కొనసాగుతోంది. ఈ ఒక్క విభాగంలోనే ప్రపంచంలోని పలు దేశాలు పోటీ పడే అవకాశం ఉండేది. బెస్ట్ గా నిలచిన చిత్రం ఆస్కార్ ను అందుకొనేది. ఎక్కువ మార్కులు పోగేసిన చిత్రాలు విజేతలుగా నిలవవచ్చు. కానీ, అంత మాత్రాన మిగిలిన సినిమాలు ఉత్తమం కాకపోవు అనే కోణంలోనూ సినీఫ్యాన్స్ ఆలోచించేవారు. ఆ కోణంలోనే ‘ఆస్కార్ నామినేషన్’ పొందిన విభాగాలనూ ఉత్తమంగా పరిగణించేవారు. అమెరికాలో అకాడమీ అవార్డులను చూసి స్ఫూర్తి చెందిన బ్రిటన్ సైతం తమ దేశంలో ‘బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డులు’ ఏర్పాటు చేశారు. ‘ఆస్కార్ అవార్డులు’ వెలుగు చూసిన సరిగా 20 సంవత్సరాల 13 రోజులకు అంటే 1949 మే 29న ‘బ్రిటిష్ అకాడమీ’ అవార్డులు మొదలయ్యాయి.
Read Also: PM Modi: ‘నాటు నాటు’ సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది.. ప్రధాని అభినందనలు
తరువాతి రోజుల్లో ఇటు అమెరికా, అటు బ్రిటన్ అకాడమీ అవార్డులు వెనుకాముందూ సాగుతూ వచ్చాయి. కొన్నిసార్లు అమెరికా అకాడమీ అవార్డుల తరువాత బ్రిటిష్ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం సాగేది. మరికొన్నిసార్లు ఆస్కార్స్ కంటే ముందుగానే ‘బ్రిటిష్ ఫిలిమ్ అవార్డ్స్’ వేడుక సందడి చేసేది. ఈ సారి ఆస్కార్ కంటే ముందే బ్రిటిష్ అకాడమీ వేడుక జరిగింది. అక్కడ ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ 14 నామినేషన్లు సంపాదించి, ఏడు అవార్డులను కైవసం చేసుకుంది. చిత్రమేమిటంటే, ఆస్కార్ బరిలో 11 నామినేషన్స్ సంపాదించిన ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ చిత్రం బ్రిటిష్ అకాడమీ అవార్డుల్లో ఏ మాత్రం సత్తా చాటలేకపోయింది. అక్కడ ఈ సినిమా కేవలం ‘బెస్ట్ ఎడిటింగ్’ అవార్డును మాత్రమే సొంతం చేసుకోగలిగింది. కానీ, అమెరికా అకాడమీ అవార్డుల్లో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ పైచేయిగా సాగింది. 11 నామినేషన్స్ కు గాను, 7 అవార్డులను దక్కించుకుంది. అంతేకాదు, ఆస్కార్స్ లో ‘బిగ్ ఫైవ్’గా భావించే బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ సత్తా చాటింది. చిత్రమేమిటంటే, ఇవే విభాగాలను ‘బ్రిటిష్ అకాడమీ’ అవార్డుల్లోనూ ‘బిగ్ ఫైవ్’గా భావిస్తారు. అయితే అక్కడ బెస్ట్ పిక్చర్ గా ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ విజేతగా నిలచింది. ‘బెస్ట్ డైరెక్టర్’ అవార్డును కూడా ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ దర్శకుడు ఎడ్వర్డ్ బెర్గర్ సొంతం చేసుకున్నారు. ఇక బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలోనూ’ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమా రచయితలు ఎడ్వర్డ్ బెర్గర్, ఇయాన్ స్టాకెల్, లెస్లీ ప్యాటర్సన్ గెలుపొందారు. బ్రిటిష్ అవార్డుల్లో ‘బెస్ట్ నాన్ ఇంగ్లిష్ మూవీ’ (ఆస్కార్స్ లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ’)గానూ ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ విజయం సాధించింది.
రెండు అకాడమీ అవార్డుల్లోనూ ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో విజయం సాధించింది. పాల్ రోజర్స్ రెండు చోట్లా బెస్ట్ ఎడిటర్ గా నిలిచారు.
Read Also: Oscar Award: ఇంతకూ ‘నాటు నాటు…’కు ఆస్కార్ ఎలా వచ్చింది!?
ఇక రెండు చోట్ల ‘బెస్ట్ నాన్ ఇంగ్లిష్/ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిమ్’ అవార్డులను ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ నిలచింది. ఈ సినిమా తొమ్మిది ఆస్కార్ నామినేషన్స్ సంపాదించి, నాలుగు అవార్డులను దక్కించుకుంది. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా జేమ్స్ ఫ్రెండ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్స్ గా క్రిస్టియన్ ఎమ్. గోల్డ్ బెక్, ఎర్నెస్టైన్ హిపర్, బెస్ట్ స్కోర్ రూపొందించి వోల్కర్ బెర్టెయిన్ ఆస్కార్ విజేతలుగా నిలిచారు. ఇవే విభాగాల్లో ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమా బ్రిటిష్ అకాడమీ అవార్డులూ సాధించడం విశేషం!
సాధారణంగా రెండు అకాడమీ అవార్డుల ప్రభావం ఒకదానిపై మరకొటి ఉంటుందని ఉంటారు. అయితే ఆ మాటను ‘ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’ విషయంలో నిజమే అనుకోవాలి. ఎందుకంటే, అక్కడ, ఇక్కడ కూడా ఈ సినిమా నాలుగు విభాగాల్లో విజయం సాధించగలిగింది. కానీ, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ అక్కడ సత్తా చాటలేకపోయినా, ఆస్కార్స్ లో తనదైన బాణీ పలికించింది. అందువల్ల ప్రతీసారి ముందుగా ప్రకటించే అకాడమీ అవార్డులు తరువాత ప్రదానం చేసే అకాడమీ అవార్డులపై ప్రభావం చూపిస్తాయని భావించరాదు.