Oscar Award: రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’లో చంద్రబోస్ రాసిన, కీరవాణి స్వరపరచిన “నాటు నాటు…” అంటూ సాగే పాటకు ఆస్కార్ అవార్డు లభించగానే ఒక్కసారిగా 95వ ఆస్కార్ ఫలితాలు చూస్తోన్న భారతీయులు ఆనందంతో చిందులు వేశారు. పైగా ఈ సారి ఆస్కార్ వేడుకలోనూ ఈ పాటను లైవ్ లో పాడుతున్నప్పుడూ, చుట్టూ డాన్సర్స్ చేస్తున్న నృత్యం చూసి అక్కడ ప్రత్యక్షంగా చూసేవారు సైతం పరవశించి పోయారు. ఇక అవార్డు రాగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు, భారతీయులు “నాటు నాటు…” పాట పెట్టుకొని చిందులు వేయడమూ సాగింది. మన తెలుగు పాటకు ఆస్కార్ రావడం వెనుక సిఫార్సులు ఉన్నాయని, దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారు అలా రికమెండ్ చేశారని కొందరు చెబుతున్నారు. నిజానికి అలాంటివేమీ జరగలేదు. “నాటు…నాటు…” పాట స్వశక్తితోనే ఒరిజినల్ సాంగ్ విభాగంలో విజేతగా నిలచింది. ఈ పాటకు అంతకు ముందు జరిగిన ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు సైతం దక్కింది. ఈ విషయాన్ని విమర్శించేవారు ఎందుకు గుర్తు చేసుకోవడం లేదో! గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కానీ, ఆస్కార్ అవార్డులు కానీ సిఫార్సులకు పీట వేసేవి కావు. ఆ యా సంస్థలకు కొన్ని నియమనిబంధనలు ఉంటాయి. వాటిని పరిగణిస్తూనే విజేతను ఎంపిక చేస్తారు.
Read Also: Naatu Naatu Song: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన “నాటు నాటు…”!
మరి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఉన్న నియమనిబంధనలు ఏవి? ఈ విభాగంలో నామినేషన్ పొందాలంటే, సదరు పాట ఎంతోమందిని ఆకట్టుకొని ఉండాలి. ఎందరి నోళ్ళలోనో నానుతూ ఉండాలి. అలా నానడానికి ముఖ్యమైనవి “అలతి అలతి పదాలు”. అవి ఉంటేనే పరభాషల వారు సైతం ఏ భాష పాటనైనా ఇష్టపడి హమ్ చేస్తూ ఉంటారు. దాంతో ప్రచారం బాగా సాగుతుంది. ఇక ఆ పాట సదరు చిత్రంలో వినసొంపుగా ఉండాలి. ఆ పాటకు తగ్గ సందర్భమూ అమరాలి. ఆ పాటలో ఏదో ఒక ప్రత్యేకత కూడా చొప్పించాలి. ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు నాటు…” పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ రావడానికి ఈ నియమాలన్నిటినీ పరిశీలించారు. ఈ సారి ఆస్కార్ నామినేషన్ పొందిన మిగతా పాటలతో పోల్చి చూస్తే, అవి నేపథ్య గీతాలుగానే వినిపించాయి. అయితే వాటికి భిన్నంగా మన పాటలో ఉన్నది డాన్స్. మన నేటివిటీ. మన జానపద పదాలతో కూడిన ఒరిజినాలిటీ. ఈ పాటను తెరపై చూడగానే ఎందరో తెలుగు తెలియని వారు సైతం చిందులు వేశారు. కాబట్టి, పాటకు ఎంత ప్రాచుర్యం లభించిందో చెప్పక్కర్లేదు. పైగా పదాలు చిన్నగా ఉండడంతో “నాటు నాటు…” అంటూ పరభాషలవారు సైతం ఈ పాటను హమ్ చేస్తూ సాగారు. ఈ పాటలో మన తెలుగుదనం ఉట్టిపడేలా పదాలు చోటు చేసుకున్నాయి. అందుకు తగ్గట్టుగా స్వరకల్పన సాగింది. గాయకులూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పాటలో నర్తించిన యన్టీఆర్, రామ్ చరణ్ కు నృత్యరీతులు సమకూర్చిన డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ప్రత్యేకత ప్రదర్శించారు. ఇలా ఎలా చూసినా మిగతా పాటలకన్నా ఆస్కార్ నియమనిబంధనలకు అనువుగానే ‘నాటు నాటు…” పాట సాగింది. విజేతగా నిలిచింది.