న్యూయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. అయితే.. న్యూయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి 10 నుంచి ఆదివారం తెల్లవారుజామున 2 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. బేగంపేట్, లంగర్ హౌజ్ ఫ్లై ఓవర్లు మాత్రం తెరిచి ఉంటాయని, ఇక ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వాహనాలను అనుమతించమని పోలీసులు పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
Also Read : TSPSC : నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-3 నోటిఫికేషన్ రిలీజ్
వీవీ స్టాచ్యూ, ఎన్టీఆర్ మార్గ్, రాజ్ భవన్ రోడ్, బీఆర్కే భవన్, తెలుగు తల్లి జంక్షన్, ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్, లిబర్టీ జంక్షన్, అప్పర్ ట్యాంక్ బండ్, అంబేద్కర్ స్టాచ్యూ, రవీంద్ర భారతి, ఖైరతాబాద్ మార్కెట్, నెక్లెస్ రోటరీ, సెన్‌సెషన్ థియేటర్, రాజ్‌దూత్ లేన్, నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి, సంజీవయ్య పార్క్, పీవీఎన్ఆర్ మార్గ్, మినిస్టర్ రోడ్, సైలింగ్ క్లబ్, కవాడిగూడ ఎక్స్ రోడ్, లోయర్ ల్యాంక్ బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్‌రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. మింట్ కంపౌండ్ రహదారిని కూడా మూసివేయనున్నారు. బస్సులు, ట్రక్కులతో పాటు ఇతర వాహనాలను రాత్రి 2 గంటల వరకు హైదరాబాద్‌లోకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఇక నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతాయని పోలీసులు వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా.. అర్థరాత్రి వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంచారు.