డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) హైదరాబాద్ జోన్ కార్యాలయం, అగ్రి గోల్డ్ గ్రూప్ కంపెనీలు నడిపిన పొంజీ స్కీమ్ బాధితులకు సంబంధించి రూ. 611 కోట్ల విలువైన ఆస్తులను పునరుద్ధరించడం ద్వారా మరోసారి విజయాన్ని సాధించింది. అటాచ్ మెంట్ సమయంలో వీటి విలువ రూ.611 కోట్లు కాగా, ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1000 కోట్లు మించిపోయే అవకాశం ఉంది. ఈ ఏడాది మే నెలలో ఈడీ, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) 2002 సెక్షన్ 8(8) కింద ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిలో అటాచ్ చేసిన స్థిర, చర ఆస్తులను ఆంధ్రప్రదేశ్ సీఐడీకి విడుదల చేసి, ఆస్తులను బాధితులకు తిరిగి అప్పగించే నిమిత్తంగా ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం (APPDFE), 1999 ప్రకారం పునరుద్ధరించాలని కోరింది.
Also Read:Pawan Kalyan: లోయలోకి పవన్ కళ్యాణ్ పరుగులు.. అందుకేగా రియల్ హీరో అనేది!
హైదరాబాద్‌లోని మేట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు, ఈ పిటిషన్‌ను జూన్ 10, 2025న ఆమోదించింది. ఈ మేరకు 397 స్థిర ఆస్తుల పునరుద్ధరణకు మార్గం సాఫీ అయింది. వీటిలో 380 ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో, 13 తెలంగాణలో, 4 కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటిలో వ్యవసాయ భూములు, నివాస మరియు వాణిజ్య స్థలాలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అగ్రి గోల్డ్ గ్రూప్‌పై ఈడీ 2018లో దర్యాప్తు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్ & నికోబార్ లలో నమోదైన పలు ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఈ కేసు విచారణకు వచ్చింది. అగ్రి గోల్డ్ కంపెనీలు అసలైన రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో పొంజీ స్కీమ్ నడిపి దాదాపు 19 లక్షల ఖాతాదారుల నుంచి రూ.6380 కోట్లను వసూలు చేశాయి. 130కి పైగా కంపెనీలను ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుండి ‘ప్లాట్ అడ్వాన్స్’ పేరుతో డిపాజిట్లు వసూలు చేశారు.
Also Read:Finn Allen: చరిత్ర సృష్టించిన ఐపీఎల్ లో అమ్ముడుపోని ప్లేయర్.. ఏకంగా క్రిస్ గేల్ రికార్డే బ్రేక్..!
ఈ డబ్బులను వారు ప్రజలకు తెలియకుండా పవర్, డైరీ, ఆరోగ్యం, ఎంటర్‌టైన్‌మెంట్, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. ఒప్పందం ప్రకారం డబ్బును వెనక్కి ఇవ్వడంలో విఫలమయ్యారు. వేలాది కమిషన్ ఏజెంట్లను నియమించి ప్రజలను మోసం చేశారు. ఈడీ దర్యాప్తులో భాగంగా దాదాపు రూ.4141.2 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను అటాచ్ చేసింది. 2020 డిసెంబర్‌లో అవ్వ వెంకట రామారావు, అవ్వ శేషు నారాయణ రావు, అవ్వ హేమ సుందర వర ప్రసాద్‌ను అరెస్ట్ చేసింది. 2021 ఫిబ్రవరిలో 14 మందిపై ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. 2024 మార్చిలో మరో 22 మందిపై సప్లిమెంటరీ చార్జ్‌షీట్ సమర్పించారు.
ఇంతకు ముందు 2025 ఫిబ్రవరిలో రూ.3339 కోట్ల విలువైన ఆస్తులను బాధితులకు పునరుద్ధరించారు (ప్రస్తుత విలువ రూ.6000 కోట్లు). తాజా పునరుద్ధరణతో కలిపి మొత్తం రూ.3950 కోట్ల విలువైన ఆస్తులు బాధితులకు తిరిగి అప్పగించబడ్డాయి. వాటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.7000 కోట్లకు పైగా ఉంటుంది. ఈ చర్యలు నేరస్థుల వద్ద నుండి దోచుకున్న ఆస్తులను తిరిగి న్యాయబద్ధంగా బాధితులకు అప్పగించడంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీసుకున్న ప్రాముఖ్యమైన అడుగుగా భావించబడుతుంది.