Mangalagiri: అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. మంగళగిరి వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజు.. ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే, ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాతో తాడేపల్లిలో రాజీనామాలు మొదలయ్యాయి.. వైసీపీ పార్టీ పదవులకు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి గుడ్‌బై చెప్పారు. అంతటితో రాజీనామాలు ఆగలేదు.. తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షులు పార్టీని వీడారు.. జేసీఎస్ కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేయగా.. జిల్లా ప్రధాన కార్యదర్శి, తాడేపల్లి పట్టణ నేత, జేసీఎస్ కన్వీనర్ ఈదులముడి డేవిడ్ రాజ్.. జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డి.. మంగళగిరి రూరల్ మండలం జేసీఎస్ కన్వీనర్ అన్నపురెడ్డి బ్రహ్మర్గన రెడ్డి.. ఇలా నేతలంతా వరుసగా తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఇలా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.
Read Also: Gutha Sukender Reddy: నేను పార్టీ మారడం లేదు.. క్లారిటీ ఇచ్చిన గుత్తా సుఖేందర్
కాగా, పార్టీకి గత కొంత కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ వస్తున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు.. మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై కూడా ఆర్కే ఆవేదనతో ఉన్నట్టుగా ప్రచారం జరగుతోంది.. మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ.. బీసీలకు కేటాయిస్తుందనే ప్రచారం కూడా మరో కారణంగా చెబుతున్నారు.. ఈ క్రమంలోనే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.. ఇక, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను గెలిపించిన మంగళగిరి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఆర్కే.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. స్పీకర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఓఎస్‌డీకి నా రాజీనామా లెటర్ అందించి రాజీనామా ఆమోదించేలా చూడాలని కోరడం జరిగిందంటూ తెలిపిన ఎమ్మెల్యే ఆర్కే.. నేను 1995 నుండి రాజకీయాల్లో ఉన్నాను.. 2004 లో సత్తెనపల్లి సీటు ఆశించా.. 2009లో పెదకూరపాడులో సీటు ఇచ్చి వెనక్కు తీసుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఇక, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ తోనే నేను ఉన్నానని తెలిపారు.. 2014, 2019లో ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ నాకు అవకాశం ఇచ్చారని తెలిపారు. అయితే, నా వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.