ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి.. ఐదు విజయాలు సాధించింది. ఈ ఐదు విజయాలు బయటి మైదానాల్లో సాధించినవే కావడం గమనార్హం. హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఆర్సీబీ ఓడిపోయింది. నేడు సొంత మైదానంలో ఆడేందుకు సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో బెంగళూరు తలపడనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ హోంగ్రౌండ్ ప్రదర్శనపై స్పందించాడు. ఓటములకు సాకులు చెప్పడం సరైంది కాదన్నాడు.
‘చిన్నస్వామి స్టేడియం పిచ్‌లు కాస్త క్లిష్టంగా ఉన్నాయి. ఈ కారణంగానే హోంగ్రౌండ్‌లో మేం ఓడిపోతున్నామని చెప్పడం సరైంది కాదు. ఇప్పటివరకు మేం హోంగ్రౌండ్‌లోలో బాగా ఆడలేదు. బయటి వేదికల్లో గొప్పగానే ఆడాం, కీలక విజయాలు సాధించాం. టాస్ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అది నా చేతుల్లో లేదు. పిచ్‌లు మాత్రం అంచనాలకు భిన్నంగా స్పందిస్తున్నాయి. మేం త్వరగా ఆ పరిస్థితులను అలవాటు పడాల్సి ఉంటుంది. టాస్ ఓడినంత మాత్రాన సగం మ్యాచ్ కోల్పోయినట్లు కాదు. ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చినపుడు అత్యుత్తమంగా ఆడి స్కోరు బోర్డుపై పరుగులు ఉంచాలి. కాబట్టి టాస్ మీద కంటే మ్యాచ్ పైనే ఎక్కువ దృష్టి పెడతాం. హోంగ్రౌండ్‌లో ఓటమి పాలయ్యామని ఎప్పుడూమాట్లాడుతూ ఉండం. ఈరోజు మ్యాచ్‌పై దృష్టి పెట్టి.. విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం’ అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.
Also Read: Jasprit Bumrah: బుమ్రా.. కాస్తైనా కనికరం ఉండక్కర్లా!
ఐదు విజయాలతో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్‌పై భారీ విజయం సాధిస్తే.. అగ్రస్థానానికి చేరుకొనే అవకాశం ఉంది. మాములు విజయం సాధిస్తే.. మూడో స్థానానికి చేరుకుంటుంది. గుజరాత్ (12), ఢిల్లీ (12)లు నెట్ రన్‌రేట్‌లో ముందున్నాయి. పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయి. టాప్ -2లోని నిలిచిన టీమ్‌లకు నాకౌట్ స్టేజ్‌లో రెండు అవకాశాలు ఉంటాయి.