ఐపీఎల్ 2025 పునఃప్రారంభమవుతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి భారీ షాక్ తగిలేలా ఉంది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ 2025లోని మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తోంది. భుజం గాయం ఇంకా తగ్గని కారణంగా ఆసీస్ వెళ్లిన హేజిల్‌వుడ్.. భారత్ తిరిగి వచ్చే అవకాశాలు లేవని సమాచారం. ఇదే జరిగితే ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బ తగులుతుంది. ఈ సీజన్‌లో హేజిల్‌వుడ్ 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ నిలిచే సమయానికి అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా ఉన్నాడు.
భుజం నొప్పితో బాధపడుతున్న జోష్ హేజిల్‌వుడ్ మే 3న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో బెంగళూరు ఆడే మ్యాచ్‌కు కూడా అతడు దూరమవుతాడని వార్తలు వచ్చాయి. ఈ లోపే భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మధ్య ఐపీఎల్ 2025 వారం రోజుల పాటు వాయిదా పడింది. స్వదేశం వెళ్లిన హేజిల్‌వుడ్.. మరలా ఐపీఎల్ 2025 ఆడే అవకాశాలు లేవు. దక్షిణాఫ్రికాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమీపిస్తున్నందున హేజిల్‌వుడ్ ఫిట్‌గా ఉండేలా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంటోంది.
Also Read: Virat Kohli: కోహ్లీని మీరైనా కాస్త ఆపండి.. అనుష్క శర్మకు స్పెషల్ రిక్వెస్ట్!
ఐపీఎల్ వాయిదా పడడం, భారత్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో చాలా మంది విదేశీ ప్లేయర్స్, సిబ్బంది స్వదేశాలకు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మే 15 లేదా 16న ఐపీఎల్ తిరిగి మొదలయ్యే అవకాశముంది. మే 13 నాటికి ప్లేయర్స్ అందరూ జట్టుతో చేరేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. త్వరలోనే కొత్త షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ 2025లో ఆర్సీబీ అద్భుతంగా ఆడుతోంది. 11 మ్యాచులలో 8 విజయాలు సాధించి.. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరువైంది. దాదాపుగా ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అయింది.