18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీని సాధించిన విషయం తెలిసిందే. మంగళవారం (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో ఆర్సీబీ గెలవగానే బెంగళూరులో సంబరాలు మిన్నంటాయి. రాత్రంతా ఆ నగరం నిద్రపోలేదు. ర్యాలీలు, నినాదాలు, పటాసుల శబ్దంతో బెంగళూరు మొత్తం దద్దరిల్లింది. ఇక బుధవారం ఆర్సీబీ ఆటగాళ్లు సొంతగడ్డకు వస్తుండడంతో.. విజయోత్సవాలు ఇంకా గొప్పగా చేసుకోవాలనుకున్న అభిమానులకు చేదు అనుభవం తప్పలేదు.
బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లను కర్ణాటక క్రికెట్ సంఘం ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. అంతకంటే ముందు నగరంలో విజయోత్సవ ర్యాలీ కూడా చేయాలని ఏర్పాట్లు భావించింది. అయితే అంతలోనే విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగి.. 11 మంది చనిపోయారు. స్టేడియం వద్ద తీవ్ర విషాదం నెలకొనడంతో ఆర్సీబీ సంబరాలు చిన్నబోయాయి. తొక్కిసలాట ఘటన తర్వాత స్టేడియంలో విజయోత్సవ కార్యక్రమాన్ని కొనసాగించారు కానీ.. అది కళ తప్పింది. 2-3 గంటల పాటు ఘనంగా చేయాలనుకున్న విజయోత్సవ కార్యక్రమాన్ని కేవలం 20 నిమిషాల్లో సదాసీదాగా ముగించారు. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పాటీదార్ కొద్దిసేపే మాట్లాడారు.