18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుచుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంతో.. బెంగళూరు నగరంలో విక్టరీ పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో గ్రాండ్ సెలబ్రేషన్‌కు ప్లాన్ చేశారు. అయితే ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరిగి.. 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఆర్సీబీపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. కొందరిని అరెస్ట్ కూడా చేశారు.
ఎఫ్‌ఆర్‌ఐ నమోదైన నేపథ్యంలోనే ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఆ కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. తమను తప్పుడు కేసులో ఇరికించారని ఆర్సీబీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తమపై నమోదైన కేసును రద్దు చేయాలని కర్ణాటక హైకోర్టును కోరారు. మరోవైపు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా న్యాయస్థానంను ఆశ్రయించింది. తమపై నమోదైన కేసుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. తొక్కిసలాట ఘటనపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.