టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ నటించిన ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీ గత శుక్రవారం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ తెలుగులో పంపిణీ చేసింది. ఈ చిత్రానికి మాస్ మహరాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాకు తమిళంలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయని, తెలుగులోనూ ఆదరణ బాగుందని విష్ణు విశాల్ మంగళవారం మీడియాతో తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ తర్వాత థియేటర్ల ఓనర్స్, పంపిణీ దారులు ఈ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడటం ఆనందాన్ని కలిగించిందని విష్ణు విశాల్ చెప్పారు.
అయితే కొంతమంది ముస్లింలు ఈ మూవీ పోస్టర్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారని, వారందరికీ తాము క్షమాపణలు చెప్పామని, ముస్లిం సోదరులు ఒకసారి సినిమాను చూస్తే తమను అర్థం చేసుకోగలరనే నమ్మకం ఉందని విష్ణు విశాల్ అన్నారు. అతి త్వరలోనే రవితేజకు సంబంధించిన ఆర్.టి. టీమ్ వర్క్స్ తో విష్ణు విశాల్ స్టూడియోస్ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాను ప్రారంభించబోతోందని, అందులో తెలుగు నటీనటులే ఎక్కువ ఉంటారని అన్నారు.
అభిషేక్ పిక్చర్స్ సీఈవో వాసు మాట్లాడుతూ.. ‘తెలుగులో 262 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశాం. ప్రేక్షకుల ఆదరణ బాగుంది. చక్కని రివ్యూలు వచ్చాయి. మా మూవీ పబ్లిక్ విన్నర్ గా నిలిచింది. విష్ణువిశాల్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. గౌతమ్‌మీనన్ తన డైలాగ్ డెలివరీలో ప్రత్యేకతను చూపించారు. తొలిసారి దర్శకత్వం వహించిన మను ఆనంద్ మూవీని బాగా డీల్ చేశాడు’ అని అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మను ఆనంద్, నటి రెబ్బా మోనిక చక్కని సందేశం ఉన్న ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.