Chilukuru: చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్‌పై దాడి చేసిన రామరాజ్యం వీర రాఘవరెడ్డి ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు మూడురోజులపాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ రోజు నుంచి మూడు రోజులపాటు పోలీసులు వీర రాఘవరెడ్డిని విచారించనున్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో వీర రాఘవరెడ్డి సంబంధించిన అనేక కీలక అంశాలు వెలుగుచూశాయి. తాను శివుడి అవతారం అని ప్రకటించుకుని, “రామరాజ్యం” పేరిట రిక్రూట్మెంట్ ప్రారంభించినట్టు పోలీసులు గుర్తించారు.
Read Also: Fake IT Jobs: ఫేక్ ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి యువతను మోసం చేసిన నిందితుడు అరెస్ట్
పోలీసుల దర్యాప్తులో వీర రాఘవరెడ్డి రామరాజ్యం పేరిట అనేక అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. “దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ” మాత్రమే రామరాజ్యంలో సాధ్యమని భావించి, అనుచరులను ప్రభావితం చేశాడు. ఈ నేపథ్యంలో పూజారులపై భౌతిక దాడులు చేసి, భయపెట్టే ప్రయత్నం చేశాడు. రామరాజ్యం పేరుతో సాధువులను, పూజారులను దోచుకుంటూ, వాటిని తన స్వలాభం కోసం ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక పోలీసుల విచారణలో వీర రాఘవరెడ్డిపై 2015, 2016లోనూ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. గతంలోనూ వివిధ నేరాల్లో పాల్పడిన అతను, ఇప్పుడు చిలుకూరు రంగరాజన్‌ను ఉగాది వరకు సమయం ఇస్తున్నామని బెదిరించడం ఈ కేసును మరింత తీవ్రతరం చేసింది.
వీర రాఘవరెడ్డిని వెంటనే అరెస్టు చేయకపోతే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అతని చర్యలు సమాజంలో అశాంతి నెలకొల్పేలా ఉన్నాయంటూ, కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. పోలీసులు ఇప్పుడు వీర రాఘవరెడ్డిని మూడురోజులపాటు విచారించనున్నారు. అతని మద్దతుదారులు ఎవరెవరు? అతను ఇప్పటివరకు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడు? భవిష్యత్తులో ఎలాంటి కుట్రలు పన్నాడు? అనే అంశాలపై పోలీసులు పూర్తి వివరాలు సేకరించనున్నారు. ఈ కేసు మరిన్ని కీలక మలుపులు తిరగొచ్చని భావిస్తున్నారు. వీర రాఘవరెడ్డికి మద్దతునిచ్చిన వారిపై కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.