Fake IT Jobs: హైదరాబాద్ మాదాపూర్‌లో భారీగా ఐటీ ఉద్యోగాల మోసం బయటపడింది. నియోజెన్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ పేరుతో నకిలీ ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి, ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసిన కాలువ భార్గవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. భార్గవ్ గతంలో ఓ ఐటీ కంపెనీలో HR (హ్యూమన్ రిసోర్స్) గా పనిచేసిన అనుభవం ఉంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ, ఉద్యోగ నియామకాలపై పూర్తిగా అవగాహన కలిగిన ఇతను, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు సృష్టించి నిరుద్యోగులను మోసం చేయడం మొదలుపెట్టాడు.
Read Also: New CEC Gyanesh Kumar: కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్.. ఆమోదించిన రాష్ట్రపతి
నిరుద్యోగుల వివరాలను సేకరించేందుకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, కన్సల్టెన్సీల నుంచి రెస్యూమ్‌లు కొనుగోలు చేసి, వారికి జాబ్ ఆఫర్లు వచ్చాయని మెయిల్స్ పంపేవాడు. అనంతరం, ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగం పొందేందుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసేవాడు. “బ్యాక్‌డోర్ ఉద్యోగాలు” అనే పేరు చెప్పి ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసాడు భార్గవ్. ఇలా చాలామందికి ఆశలు పెట్టి నిరుద్యోగుల నుండి డబ్బులను వాసులు చేసినట్లు సమాచారం.
అయితే, నిరుద్యోగుల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి పోలీసులు భార్గవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఒక లక్ష నగదు, 5 నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, 2 నకిలీ ఐడీ కార్డులు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. భార్గవ్‌పై ఇప్పటికే లాలాగూడ, జీడిమెట్ల, మాదాపూర్, కల్వకుర్తి పోలీస్ స్టేషన్లలో 4 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఉద్యోగ అవకాశాలను పరిశీలించకుండా డబ్బులు చెల్లించరాదని పోలీసు అధికారులు సూచించారు. జాబ్ ఆఫర్ల పేరుతో డబ్బులు అడిగిన వారిపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.