NTV Telugu Site icon

Rammohan Naidu: కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు

Rammohan Naidu

Rammohan Naidu

Rammohan Naidu: ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారని.. తనపై నమ్మకంతో ప్రధాని మోడీ పౌర విమానయాన శాఖ అప్పగించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనపై పెట్టిన బాధ్యతకు సంపూర్ణ న్యాయం చేస్తానని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా అన్నారు. మోడీ వంద రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్ని శాఖలను కోరారని.. ఈజ్‌ ఆఫ్ ఫ్లయింగ్‌పై దృష్టి పెడతామని ఆయన చెప్పారు. టైర్-2, టైర్‌-3 నగరాలకు కూడా విమానయానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సామాన్యులు విమానాల్లో ప్రయాణించేలా ప్రయత్నం చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను రికార్డు సమయంలో పూర్తి చేస్తామన్నారు. విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు కనెక్టివిటీ పెంచాలనే డిమాండ్ ఉందని.. సివిల్ ఏవియేషన్‌కు బెస్ట్‌ మోడల్‌గా ఏపీని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఐదేళ్లు పౌర విమానయాన శాఖలో బలమైన పునాదులు వేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.

Read Also: Chandrababu: విద్యా కానుక కిట్లను త్వరగా పంపిణీ చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

పర్యావరణ అనుకూలంగా తన మంత్రిత్వ శాఖను తీర్చిదిద్దుతానని ఆయన వెల్లడించారు. పర్యావరణ హితంగా తమ శాఖను తీర్చిదిద్దుతామని రామ్మోహన్ చెప్పారు. ఎయిర్‌ పోర్ట్‌లకు కావాల్సిన బడ్జెట్‌ లభిస్తుందన్నారు. 2014లో అశోక్ గజపతి కేంద్ర మంత్రిగా విమానయాన మంత్రిత్వ శాఖను నిర్వహించారని, ఆయన వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో విమాన యాన రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారని, ఆయన దార్శనికతతోనే విమానయాన రంగం ముందుకు వెళ్లిందన్నారు. ఉడాన్‌ స్కీమ్‌ను అశోక్ గజపతి హయంలోనే ప్రారంభించారని ఎంతోమంది దాని ద్వారా విమానయానం అందుబాటులోకి వచ్చిందన్నారు. దేశంలో మరింత డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. విమానయానశాఖలో సింధియా అమలు చేసిన సంస్కరణలు కొనసాగిస్తామన్నారు. గత పదేళ్లుగా వికసిత్ భారత్‌లో భాగంగా విమానయాన రంగంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఏపీలోని రాజమండ్రి, కడప, కర్నూలు విమానాశ్రయాలను మరింత అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ అవసరాలను కూడా గుర్తించి వారికి సహకరిస్తామని తెలిపారు. తెలంగాణలో కూడా విమానయానం అవసరాలను తీర్చేందుకు సహకారం అందిస్తామన్నారు.