Surya Tilak on Ram Lalla’s Forehead: నేడు ‘శ్రీరామ నవమి’. ఈ సందర్భంగా యూపీలోని అయోధ్య ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. ఈ శ్రీరామ నవమి అయోధ్యకు ప్రత్యేకమైనది. ఎందుకంటే.. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇదే తొలి నవమి. శ్రీరామ నవమి సందర్భంగా రామ్‌లల్లా దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్య కిరణాలు బాల రాముడికి తిలకం దిద్దాయి.
సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముడి నుదిటిపై సూర్య కిరణాలు పడ్డాయి. కొన్ని నిమిషాల పాటు సూర్య కిరణాలు అలానే ఉన్నాయి. ఆధునిక సాంకేతికత సాయంతో సూర్య కిరణాలు గర్భ గుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి. బాల రాముడి నుదిటిపై కన్పించిన సూర్య తిలకంతో భక్తులు పరవశించిపోయారు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: Ananya Reddy: విరాట్ కోహ్లీ నా ఇన్స్పిరేషన్.. యూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డి!
అయోధ్య ఆలయంలోని మూడో అంతస్తు నుంచి గర్భ గుడిలోని బాల రాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరించి.. రాముడి నుదుటిపై తిలకంగా కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో సీబీఆర్‌ఐ శాస్త్రవేత్తలు ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రతి శ్రీరామ నవమి రోజున రాముడి విగ్రహంపై ఈ తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు.