Rajasthan: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడవు ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతల్ని పాత కేసులు వెంటాడుతున్నాయి. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల టీచర్ల రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ల లీక్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా కుమారుడికి ఈడీ సమన్లు జారీ చేసింది.
ఈ కేసులో రాజస్థాన్ పోలీసులు అనేక మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని ఆధారంగా ప్రస్తుతం ఈడీ మనీలాండరింగ్ కేసును విచారిస్తోంది. అయితే ఈ చర్యలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఎన్నికలు ఉన్నాయనే కేంద్రంలోని బీజేపీ, కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పుతోందని ఆరోపిస్తున్నారు.
Read Also: Nitish Kumar: “ఇండియా కూటమిలో ఊపు లేదు”.. బీహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు..
ఇప్పటికే ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ కీలక నేతలు మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు దేశంలోని ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపించారు. బెంగాల్ సీఎం కూడా ప్రతిపక్ష నేతలను ఎన్నికల ముందు అరెస్ట్ చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు.
5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈ నెలలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాజస్థాన్ లో నవంబర్ 23న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి.