ఆ రెండు పార్టీలు విలువలు విడిచిపెట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలను మభ్యపరిచి మోసగించడానికి చూస్తున్నాయని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో బాణాసంచా విక్రయ బజారు ప్రారంభోత్సవానికి వచ్చిన భరత్ మీడియాతో మాట్లాడారు. జనసేన-టీడీపీలది అనైతిక పొత్తని అభివర్ణించారు. ఆంధ్రాలో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తామంటున్నాయని, తెలంగాణాకు వచ్చేసరికి జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతిస్తుంటే, మరి టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతిస్తోందన్నారు. అక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ నేత కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు పోటీ నుంచి చంద్రబాబు తప్పుకున్నారని అన్నారు. అంటే పవన్ బీజేపీకి, చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
Read Also: MLA Shankar Rao: నా మీద పోటీకి టీడీపీ నాయకులను వెతుక్కుంటుంది
అదే ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఈ జనసేన, టీడీపీ చేతులు కలిపి ఎన్నికలకు దిగడం వారి దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోందని ఎంపీ భరత్ అన్నారు. ఇదెక్కడి రాజకీయాలో, ఇవేమి తెలివితేటలో.. ఈ రెండు పార్టీల వ్యవహార తీరు చూసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలూ అసహ్యించుకుంటున్నారని తెలిపారు. విలువలకు తిలోదకాలిచ్చి కేవలం అధికార దాహంతో ఈ విధంగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. కేంద్రంలో బీజేపీకి వైసీపీ ఎప్పుడూ మద్దతివ్వలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఎంపీ భరత్ తెలిపారు. అంశాల వారీగా అదీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే బీజేపీతో సఖ్యతగా ఉంటున్నామని..స్నేహపూర్వకంగా ఉంటూ రాష్ట్రానికి కావలసిన అభివృద్ధి పనులు, నిధులు సాధించుకోవడంలో సఫలీకృతం అయ్యామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Read Also: Pithani Satyanarayana: జగన్ పై ప్రజలకు నమ్మకం లేదు.. అందుకే ఆ కార్యక్రమం మొదలు పెట్టారు
జనసేన బీజేపీతో పొత్తు, ఆంధ్రాలో టీడీపీతో పొత్తుని ప్రజలు స్వాగతించడం లేదని ఎంపీ అన్నారు. ఎందుకంటే బీజేపీకి టీడీపీ అంటే పడదని, అటువంటిది జనసేన బీజేపీతో దాగుడు మూతలు ఆడుతోందన్నారు. తెలంగాణాలో వైఎస్సార్ టీపీ కాంగ్రెస్ కు మద్దతివ్వడం అనే అంశంపై ఒక విలేకరి ప్రశ్నించగా.. ఆ పార్టీతో, ఆమెతోనూ వైసీపీకి ఏ విధమైన సంబంధం లేదన్నారు. అది ఆమె వ్యక్తిగతమని, మా పార్టీ ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితమని ఎంపీ భరత్ స్పష్టం చేశారు. వైఎస్సార్ టీపీకి తమకూ ఎటువంటి సంబంధం లేదని నొక్కి చెప్పారు.