దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు పయనమయ్యారు హైదరాబాద్ నగరవాసులు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. కాలేజీలకు కూడా సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు కూడా సొంత ఊర్లకు వెళ్తున్నారు. అయితే రద్దీకి తగ్గట్టు రైళ్లను నడపడం లేదని వాపోతున్నారు ప్రయాణికులు. కోవిడ్ కారణంగా నిలిపివేసిన రైళ్లు సైతం పూర్తి స్థాయిలో నడపటం లేదని చెబుతున్నారు.
రెండు నెలల ముందు రిజర్వేషన్ చేసుకుంటేనే కానీ రైలులో ప్రయాణం చేయలేకపోతున్నమని, అప్పటికప్పుడు వెళ్ళాలంటే సాధారణ రైళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. పండుగల వేళ రైల్వేశాఖ మరిన్ని రైళ్ళను నడపలంటున్నారు ప్రయాణీకులు, సికింద్రాబాద్ నుంచి విశాఖ, శ్రీకాకుళం సుదూర ప్రాంతాలకు రెండు మూడు రైల్లే నడుస్తున్నాయని, వాటికి సైతం బుకింగ్స్ లేక స్టేషన్ లో వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. దసరా, దీపావళి, క్రిస్టమస్ పండుగలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైన రైల్వే శాఖ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని సేవలు పెంచాలంటున్నారు.