భారత రైల్వే ప్రయాణీకుల ఛార్జీలు పాశ్చాత్య దేశాలతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నాయని రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖ పనితీరుపై సభలో జరిగిన చర్చకు వైష్ణవ్ సమాధానమిస్తూ.. పొరుగు దేశాల కంటే భారతదేశంలో రైలు ప్రయాణీకుల ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. పాశ్చాత్య దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక రైల్వే ఛార్జీలను ప్రస్తావించారు. అక్కడ రైల్వే ఛార్జీలు భారతదేశం కంటే 10-15 శాతం ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
రైల్వే మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ.. రైల్వేలు తమ ప్రయాణీకులకు అతి తక్కువ ధరలకు సురక్షితమైన, నాణ్యమైన సౌకర్యాలను అందించడానికి కట్టుబడి ఉన్నాయని అన్నారు. మరోవైపు.. విద్యుదీకరణ కారణంగా రైల్వేలు ప్రయోజనాలను పెంచుకొని.. ప్రయాణీకుల సంఖ్య, సరుకు రవాణా పెరిగినా.. ఇంధన ఖర్చులు స్థిరంగా ఉన్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే నెట్‌వర్క్ ఆధునీకరణపై బిజెపి ఎంపీలు ప్రశంసలు కురిపించారు. రైల్వే స్టేషన్లు ఇప్పుడు విమానాశ్రయాల మాదిరిగా మారాయని అన్నారు. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్‌వర్క్‌గా మారాయని.. దేశంలో 136 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని.. బుల్లెట్ రైలు కల కూడా త్వరలో సాకారం అవుతుందని ఆయన అన్నారు. హైడ్రోజన్ శక్తితో రైళ్లను నడపడానికి ప్రయోగాలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ సంజయ్ సేథ్ తెలిపారు.
Read Also: GVMC Mayor Post: వైసీపీకి బిగ్ షాక్..! గ్రేటర్ విశాఖ పీఠంపై కూటమి గురి..
అన్నాడీఎంకే సభ్యుడు ఎం తంబిదురై మాట్లాడుతూ.. తమిళనాడులో అనేక రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. రైల్వేలో ప్రయాణికుల భద్రత, ముఖ్యంగా మహిళల భద్రతపై శ్రద్ధ వహించాలని దురై తెలిపారు. రాత్రిపూట రైళ్లలో టిటిఆర్, పోలీస్, భద్రతా సిబ్బంది ఉండాలని ఆయన సూచించారు. చర్చలో పాల్గొన్న బిజెపి సభ్యుడు మిథిలేష్ కుమార్ మాట్లాడుతూ.. సాధారణ బడ్జెట్‌లో రైల్వేలకు కేటాయించిన నిధులు ఆధునిక రైల్వే నెట్‌వర్క్‌ను నిర్మించడంలో.. ప్రయాణీకుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవడంలో సహాయపడతాయని అన్నారు. ఎంపీ నరహరి అమీన్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో రైల్వే బడ్జెట్ దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని తెలిపారు. గత పదేళ్లలో 34 వేల కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్లు వేశామని.. ఇది జర్మనీలో వేసిన మొత్తం రైల్వే లైన్ల సంఖ్య కంటే ఎక్కువని ఆయన వెల్లడించారు. గత పదేళ్లలో 45 వేల కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్లను విద్యుదీకరించామని.. 12 నగరాల్లో మెట్రో రైలు సేవలు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.
గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయని, కానీ ఈశాన్య రాష్ట్రాల గురించి ఎవరూ ఆలోచించలేదని బిజెపికి చెందిన రాజీవ్ భట్టాచార్య అన్నారు. 2016లో అగర్తలాను బ్రాడ్ గేజ్ రైల్వే లైన్‌తో అనుసంధానించే పని తొలిసారిగా ప్రారంభించబడిందని ఆయన అన్నారు. చర్చలో పాల్గొన్న బిజెపికి చెందిన రామేశ్వర్ తేలి మాట్లాడుతూ.. గత యుపిఎ ప్రభుత్వ హయాంలో జరిగిన రైల్వే ప్రమాదాల సంఖ్యతో పోలిస్తే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇటువంటి ప్రమాదాల సంఖ్య నిరంతరం తగ్గుతోందని అన్నారు.