Rahul Gandhi to lead Bharat Nyay Yatra from 2024 January 14: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేపట్టనున్నారు. ‘భారత్ న్యాయ యాత్ర’ పేరుతో రాహుల్ పాదయాత్ర చేయబోతున్నారని బుధవారం ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14వ నుంచి మార్చి 20 వరకు 14 రాష్ట్రాల గుండా ఈ యాత్ర కొనసాగనుంది. మణిపూర్‌లో మొదలయ్యే భారత్ న్యాయ యాత్ర.. ముంబై వరకు 6,200 కిలోమీటర్ల మేర సాగనుంది.
బస్సు, కాలి నడక ద్వారా రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’ కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. భారత్ జోడో యాత్ర ఇచ్చిన గొప్ప అనుభవంతో.. రాహుల్ ఈ యాత్ర చేయబోతున్నారని చెప్పారు. ఈ యాత్రలో యువతను, మహిళలను, అణగారిన వర్గాలతో రాహుల్ ముఖాముఖి అవుతారని వేణుగోపాల్ వెల్లడించారు. ఈ యాత్ర రూట్ వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
మణిపుర్ నుంచి మొదలయ్యే భారత్ న్యాయ యాత్ర.. నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా చివరకు మహారాష్ట్రకు చేరుతుంది. మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో రాహుల్ గాంధీ యాత్ర చేస్తారు. గతంలో మాదిరిగా పూర్తిగా పాదయాత్ర కాకుండా.. ఈసారి బస్సు యాత్ర ఎక్కువగా ఉంటుందట. ప్రతి రాష్ట్రంలో నేతలు ఈ యాత్రలో పాల్గొంటారట.
Also Read: IND Vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్.. భారత జట్టులో అతడు ఉంటే కథ వేరేలా ఉండేది!
దేశ ప్రజలను ఏకం చేసేందుకు కొద్ది నెలల క్రితం రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబరు 7న రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారు. దాదాపు ఐదు నెలల పాటు 4, 500 కిమీల మేర 12 రాష్ట్రాల్లో సాగింది. కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర.. కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో ముగిసింది. అప్పుడు దక్షిణ భారత్ నుంచి ఉత్తరాది వరకు యాత్ర చేపట్టిన రాహుల్.. ఈ సారి తూర్పు నుంచి పశ్చిమ వరకు చేయనున్నారు.