Congress Bharat Jodo Yatra: 2024 సార్వత్రిక ఎన్నికల్లో పుంజుకుని దేశంలో మళ్లీ పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా చుట్టాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం జరగనున్న సీడబ్ల్యూసీ మీటింగ్‌లో రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారు కానుంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో సగం కంటే పైగా రాష్ట్రాలను రాహుల్ చుట్టేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రాహుల్ పర్యటనపై రూట్ మ్యాప్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.
Read Also: అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు
జోడో యాత్రలో భాగంగా ఏపీలో కూడా రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 100 కిలోమీటర్ల మేరకు 4 రోజుల పాటు రాహల్ గాంధీ ‘భారత్ జోడో’ పాదయాత్ర సాగుతుందని తెలుస్తోంది. రెండు లోకసభ నియోజకవర్గాలు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. ముఖ్యంగా ఓబుళాపురం, ఆలూరు, ఆదోనీ, పెద్దతుంబళం, మాధవరం మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారని సమాచారం అందుతోంది. రాహుల్ గాంధీ ఏపీలోని ఏయే ప్రాంతాలలో పర్యటిస్తారో గురువారం స్పష్టత రానుంది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పడిపోయింది. ఆ పార్టీలోని ముఖ్య నేతలందరూ ఇతర పార్టీలకు వలస వెళ్లిపోయారు. దీంతో దాదాపుగా పార్టీ ఖాళీ అయ్యింది. అయితే ఇప్పుడు రాహుల్ పర్యటన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
మొత్తానికి రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ మేరకు 3,571 కి.మీ. మేర 68 పార్లమెంట్ నియోజకవర్గాలు, 203 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ దేశమంతటా పర్యటించనున్నారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమై కాశ్మీర్‌లో ముగుస్తుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.ఈ యాత్రలో రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్ర నేతలంతా పాల్గొంటారని ఏఐసీసీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తెలిపారు.