Raghu Veera Reddy: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. ఈ వ్యవహారంలో కోర్టులో పిటిషన్లు వేయడం.. విచారణ జరపడం సాగుతూనే ఉన్నాయి.. అయితే, చంద్రబాబు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒత్తిడితోనే చంద్రబాబు అరెస్టు జరిగిందన్న ఆయన.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం భుజంపై బీజేపీ తుపాకీ పెట్టి వ్యవహారాలు నడిపిస్తోందని విమర్శించారు. ఇక, బీజేపీని రెండు పార్టీలు భుజం మీద మోశాయని దుయ్యబట్టారు. మరోవైపు.. టీడీపీ నిరసనలు, ఉద్యమాలు ఎన్ని చేపట్టినా ప్రయోజనం శూన్యం అన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి.. కాబట్టి టీడీపీ కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలని సూచించారు. ఇక, బీజేపీని బలోపేతం చేయడానికి ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరిని బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా నియమించారని ఆరోపించారు. వీటన్నింటి మూల కారణం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడాలన్నది వారి ముఖ్య ఉద్దేశం అని దుయ్యబట్టారు. ఏదో ఒకరోజు వైఎస్ జగన్ కు కూడా ఇదే పరిస్థితి రాకుండా ఉండదంటూ హెచ్చరించారు రఘువీరారెడ్డి.