PM Modi: భారతదేశంలో ప్రజాస్వామ్యంపై తాను చేసిన వ్యాఖ్యలు కర్ణాటక, భారతదేశం, దేవుడిపై దాడి అని ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. లండన్ నేలపై భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరం అని కర్ణాటక పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. “ఈ వ్యక్తులు భగవాన్ బసవేశ్వరుడిని, కర్ణాటక ప్రజలను, భారతదేశ ప్రజలను అవమానిస్తున్నారు. అలాంటి వారికి కర్ణాటక దూరంగా ఉండాలి.” అని ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచం మొత్తం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను అధ్యయనం చేస్తోందని, భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యం మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యానికి తల్లి అని మనం చెప్పగలమని.. భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే శక్తి ఏదీ లేదని ప్రధాని మోదీ అన్నారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి చేసేందుకు కొందరు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ఆయన మండిపడ్డారు.
Read Also: Viral Video: బహిరంగ ర్యాలీలో మహిళా నాయకురాలిని ముద్దు పెట్టుకున్న ఎమ్మెల్యే?
భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, తనతో సహా పలువురు రాజకీయ నాయకులు నిఘాలో ఉన్నారని రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీల మధ్య తాజా చర్చనీయాంశంగా మారాయి. పదేపదే ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన దేశ విదేశాల్లో పరువు తీశారని బీజేపీ ఆరోపించింది.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశం సాధించిన విజయాలను ప్రధాని మోదీ అప్రతిష్టపాలు చేశారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఎదురుదాడికి దిగారు.
గతవారం ఇండియన్ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ, ”స్వాతంత్య్రం వచ్చిన 60 లేదా 70 ఏళ్లలో ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి ప్రకటించడం నాకు గుర్తుంది.భారతదేశంలో అపరిమిత అవినీతి ఉందని.. విదేశాల్లో ఇలా మాట్లాడడం నాకు గుర్తుంది.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏమీ చేయలేదని, ప్రతి భారతీయుడిని అవమానిస్తూ ఆయన ప్రసంగం మీరు వినలేదా.” అంటూ రాహుల్ గాంధీ అన్నారు. తానెప్పుడూ దేశ పరువు తీయలేదన్నారు.