Palle Sindhura Reddy: ఇప్పటికే టికెట్ దక్కించుకున్న నేతలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.. తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.. టీడీపీ రెండు జాబితాలో విడుదల చేయగా.. రెండో జాబితాలో శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్‌ను పల్లె సింధూర రెడ్డి దక్కించుకున్నారు. అయితే, మొదటి రోజు ఎన్నికల ప్రచారంలోనే ఆమె అస్వస్థతకు గురయ్యారు.. తొలిరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొత్తచెరువు మండల కేంద్రానికి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి చేరుకున్నారు పల్లె సింధూర.. ప్రచారానికి ఈ రోజు శ్రీకారం చుట్టడంతో.. పల్లె సింధూరకు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. భారీ ర్యాలీ నిర్వహించారు.. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చాయి టీడీపీ శ్రేణులు.. అలాగే తమ పార్టీ అభ్యర్థి సింధూరకు పూల మాలలు వేసి.. దారి పొడవునా పూలు జల్లారు.
అయితే, ఓ వైపు టీడీపీ శ్రేణుల హడావుడి.. మరోవైపు.. బాణసంచా హోరు.. దీనికి తోడు ఎండ తీవ్రత కూడా ఉండడంతో.. పల్లె సింధూర అస్వస్థతకు గురయ్యారు. ర్యాలీలోనే ఆమె సొమ్మసిల్లి పడిపోయారు.. ఆమె పరిస్థితి గమనించిన భర్త కృష్ణ కిషోర్ రెడ్డి.. ఇతర మహిళా కార్యకర్తలు ఆమెకు తోడుగా నిలిచారు.. ఆమెకు శీతలపానియాలు అందజేశారు.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారా రథం నుంచి కిందకు దించి.. కారులో ఆస్పత్రికి తరలించారు.. ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.