Pure Little Hearts Foundation: గుండె జబ్బులు ఎప్పుడూ పెద్దలకే వస్తుంటాయనుకుంటాము. కానీ విషాదం ఏమిటంటే, భారతదేశంలో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో పుడుతున్నారు. తక్షణ చికిత్స మాత్రమే వారి ప్రాణాలను కాపాడుతుంది. అధునాతన పీడియాట్రిక్ కార్డియాక్ చికిత్సలకు అందుబాటులో లేకపోవడం, ఆర్థిక పరంగా తగినంత స్థోమత లేకపోవడం వల్ల ఈ పిల్లలలో చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఆర్థిక పరిమితుల కారణంగా ప్రాణాలను రక్షించే చికిత్సలను పొందలేని చిన్ని హృదయాలకు సహాయం చేయడానికి ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ (పీఎల్‌హెచ్‌ఎఫ్) ప్రయత్నిస్తుంది. పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల (సిహెచ్‌డి లు) గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ఫౌండేషన్ ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంది. మహోన్నత కారణానికి తమ మద్దతునందించినందుకు దాతలను కూడా సత్కరించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ పాల్గొనగా.. గౌరవ అతిథిగా డాక్టర్ లక్ష్మణ్ రావు, సీవీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్- క్వాలిటీ, లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల, రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు, పీఎల్‌హెచ్‌ఎఫ్, సెక్రటరీ & పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్వేతా బఖ్రు, పలువురు లిటిల్ హార్ట్ ఛాంపియన్‌లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పీఎల్‌హెచ్‌ఎఫ్ ప్రయత్నాల ద్వారా లబ్ది పొందిన 15 మందికి పైగా లిటిల్ ఛాంపియన్‌లు ర్యాంప్ వాక్ చేశారు. తమ స్థిరత్వం, పట్టుదల, ఆకాంక్షలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ.. ” దేశంలోని చిన్ని గుండె సంబంధిత రోగులను కాపాడేందుకు అధునాతన పీడియాట్రిక్ కార్డియాక్ ట్రీట్‌మెంట్స్‌పై అవగాహన కల్పించటం చాలా కీలకం. అయితే, ఆర్థిక కారణాల వల్ల, చాలా కుటుంబాలు క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలను చేయించకుండా వాయిదా వేస్తున్నాయి. సమాజంగా , ఈ నిరుపేద పిల్లలకు కొత్త జీవితాన్ని అందించడానికి మనం చేతులు కలపాల్సి వుంది. పీఎల్‌హెచ్‌ఎఫ్ యొక్క అవిరామ ప్రయత్నాలతో పాటుగా అనేక ఉదార హృదయాల కారణంగా, 230 కంటే ఎక్కువ మంది పిల్లలు ఆరోగ్యంగా మరియు సంతోషకరమైన జీవితాలను ఇప్పుడు గడుపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరపురానిదిగా మార్చడానికి ఇక్కడ హాజరైన సాయి దుర్గ తేజ్‌ని అభినందించడానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను” అని అన్నారు.
రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. “భారతదేశంలో పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల సంభవం చాలా ఎక్కువగా వుంది, ప్రతి 1000 జననాలలో 10 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అంటే, భారతదేశంలో ప్రతి సంవత్సరం 200,000 కంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో పుడుతున్నారని ఇది వెల్లడిస్తుంది, వీరిలోనూ గణనీయమైన సంఖ్య లో పిల్లలు తీవ్రమైన పుట్టుకతో వచ్చే గుండె లోపాన్ని కలిగి ఉంటారు, వారి జీవితంలో మొదటి సంవత్సరంలోనే వైద్యపరమైన జోక్యం అవసరం పడుతుంది. అయితే వీరిలో ఎక్కువ మంది పిల్లలు పేద మరియు ఆర్థికంగా అట్టడుగు వర్గాల కుటుంబాలకు చెందినవారు. తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించాలని కోరుకున్నప్పటికీ, చాలా సందర్భాలలో, వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా చికిత్స కోసం వారు ఖర్చు చేయలేని పరిస్థితి. అందువల్ల ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ , సిహెచ్‌డి లతో బాధ పడుతున్న పేద మరియు అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలకు కార్డియాక్ చికిత్సలను అందించటం ద్వారా పూర్తి స్థాయిలో మద్దతునిస్తుంది..” అని అన్నారు .
ఆయనే మాట్లాడుతూ, “అధ్యయనాల ప్రకారం, రక్తసంబంధీకుల నడుమ జరిగే వివాహాలు, మహిళల్లో పోషకాహార లోపం, పురుగుమందులు, పాసివ్ స్మోకింగ్ యొక్క ప్రభావాలు పుట్టుకతో వచ్చే గుండె లోపాలకు దారితీసేందుకు కొన్ని కారణాలు. గర్భం దాల్చటానికి ప్రణాళిక చేస్తున్న మహిళలు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాల్సిందిగా నేను సూచిస్తున్నాను . అలాగే గర్భిణీ స్త్రీలు రుబెల్లా వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయించుకోవాలని నేను కోరుతున్నాను. చిన్ని హృదయాలను కాపాడేందుకు అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలలో ఏవైనా హెచ్చరిక లక్షణాలను గమనించినట్లయితే, ఆలస్యం చేయకుండా పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లను సంప్రదించాల్సిందిగా వారికి అవగాహన కల్పించాలి” అని అన్నారు.
లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ , క్వాలిటీ – ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, “ఈ ఉదాత్తమైన కార్యక్రమంలో భాగమైనందుకు మేము సంతోషిస్తున్నాము మరియు దీనిని సాధ్యం చేసినందుకు పిఎల్‌హెచ్‌ఎఫ్‌కి ధన్యవాదములు తెలుపుతున్నాము . లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ గత ఏడాది కాలంగా పేద మరియు అవసరార్థులైన పిల్లలకు గుండె శస్త్రచికిత్సలను అందించడంలో ప్యూర్ లిటిల్ హార్ట్స్‌కు మద్దతు ఇస్తోందని మీకు వెల్లడించేందుకు సంతోషిస్తున్నాము. మా ప్రయత్నాలు, ఫలితాలను అందిస్తుండటం మరియు పిల్లలు మంచి ఆరోగ్యంతో తిరిగి రావటంతో పాటుగా తమ ఆకాంక్షలను పంచుకోవడం ద్వారా ఆనందం పొందటం చూసి మేము సంతోషిస్తున్నాము” అని అన్నారు. ఈ తెలివైన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు సిద్దించాలని నేను ఆకాంక్షిస్తున్నాము ” అని అన్నారు.
ఈ సందర్భంగా పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీఎల్‌హెచ్‌ఎఫ్ సెక్రటరీ డాక్టర్ శ్వేతా బఖ్రు మాట్లాడుతూ… “ఆర్థిక పరిమితుల కారణంగా ప్రాణాలను రక్షించే చికిత్సను పొందలేని చిన్ని హృదయాలకు సహాయం చేయడానికి 2022 మార్చిలో ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ (పిఎల్‌హెచ్‌ఎఫ్) ఏర్పాటు చేయబడింది. ఇప్పటి వరకూ 233 మంది పిల్లలకు జీవితాన్ని పూర్తి గా జీవించడానికి తగిన మద్దతు అందించారు. బీద , ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలు పుట్టుకతోనే వచ్చే గుండె లోపాలకు సంబంధించిన చికిత్సలను పొందారు. ఈ శస్త్ర చికిత్సలలో గుండె శస్త్రచికిత్సలు, ప్రక్రియలతో సహా పుట్టుకతో గుండె సమస్యలకు చికిత్స అందించారు. ఈ శస్త్ర చికిత్సలతో చాలా వరకు స్వాభావికంగా ప్రాణాలను రక్షించేవి…” అని అన్నారు.
సుప్రీమ్ హీరో, సినీ నటుడు సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ, “ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగం కావటాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను . ఈ చిన్న ఛాంప్‌లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీకి మద్దతు ఇవ్వడంలో మీరు చేస్తున్న అద్భుతమైన పనిని గుర్తించడానికి నేను కొంత సమయం కేటాయించాలనుకుంటున్నాను. గుండె జబ్బులు ఉన్న పిల్లల జీవితాలను మెరుగుపరచడంలో మీ నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకం. మీరు చేసే ప్రతి ప్రయత్నం, ఈ చిన్న హృదయాలకు వారు తగిన సంరక్షణను పొందేలా చేయడంలో సహాయపడుతుంది. ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ చేస్తోన్న ప్రశంసనీయమైన పనికి నేను వారిని అభినందిస్తున్నాను. చాలా మంది జీవితాలలో మార్పు తీసుకురావడంలో మీ అంకితభావం మరియు కరుణకు ధన్యవాదాలు” అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ కీలకమైన కారణం పట్ల అవగాహన కల్పించటం తో పాటుగా తమ మద్దతును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. “కలిసికట్టుగా మనం , మన పిల్లలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును సృష్టించగలం..” అని అన్నారు.