Purandeshwari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. పురంధేశ్వరికి సోము వీర్రాజు బాధ్యతలను అప్పగించారు. విజయవాడ నగరంలోని బీజేపీ పార్టీ కార్యాయలంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న పురంధేశ్వరికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గజమాలతో బీజేపీ నేతలు స్వాగతం చెప్పారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో ఏపీ బీజేపీ చీఫ్ బీజేపీ పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం జరిగింది. అనంతరం పురంధేశ్వరికి బీజేపీ నేతలు శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు.
తన మీద నమ్మకం విశ్వాసంతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించినందుకు బీజేపీ అధిష్ఠానానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతం కోసం పని చేస్తానన్నారు. గత అధ్యక్షుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ వారి మార్గదర్శకత్వంలో పని చేస్తానని ఆమె చెప్పారు. బీజేపీపై ఏపీలో దుష్ప్రచారం నడుస్తోందని.. ఓట్లతో నిమిత్తం లేకుండా ఏపీకి బీజేపీ పూర్తి సహకారం అందిస్తూనే ఉందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు రూ. 6 వేలు ఇస్తున్నామని ఆమె తెలిపారు. రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డీబీటీల్లో కేంద్ర నిధులే ఉన్నాయన్నారు.
Also Read: Botsa Satyanarayana: టీఎస్పీఎస్సీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ కామెంట్స్
బాధ్యతలు స్వీకరించగానే జగన్ సర్కారుపై ధ్వజం
బాధ్యతలు చేపట్టగానే మీడియాతో మాట్లాడిన పురంధేశ్వరి.. జగన్ సర్కారుపై ధ్వజమెత్తారు. రైతులకు రూ. 12500 ఇస్తామన్న జగన్ హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. సబ్ కే సాత్.. సబ్ కా వికాస్ నినాదంతో బీజేపీ ఏపీకి సహకారం అందిస్తోందన్నారు. ఏపీకి రూ. 32 వేల కోట్ల మేర 22 లక్షల పైచిలుకు ఇళ్లని ఏపీకి కేంద్రం ఇచ్చిందన్నారు. రూ. 20 వేల కోట్లు నిధులను ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అందించిందని.. కానీ ఏపీలో కనీసం 30 శాతం మేర ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. ఇళ్లిస్తామని పేదలకిచ్చిన హామీపై రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. జాతీయ రహాదారుల నిర్మాణం భారీ ఎత్తున జరుగుతున్నాయన్నారు. నేషనల్ హైవేల నిర్మాణం తప్పించి ఏపీలో రోడ్ల నిర్మాణం జరిగిందా..? అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. జాతీయ విద్యా సంస్థలు ఏమయ్యాయి..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: AP RGUKT 2023: ఆర్జేయూకేటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
విభజన చట్ట ప్రకారం ఇవ్వాల్సిన కేంద్ర విద్యా సంస్థలను చాలా కాలం క్రితమే కేంద్రం మంజూరు చేసిందని.. ఏపీ బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని బీజేపీ సహకారం అందిస్తోందన్నారు. “ఏపీలో పరిశ్రమలు రావడం లేదు.. పెట్టుబడులు వెనక్కు వెళ్తున్నాయి. పరిశ్రమలు వచ్చేలా కేంద్రం సహకరిస్తున్నా.. ఏపీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సహకారం లేదు. ఏపీ ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో నరేగా నిధులే ఉన్నాయి. ఇప్పటి వరకు కేంద్రం ఏపీకి నరేగా నిమిత్తం వేలాది కోట్లు ఇచ్చింది. ఏపీలో 90 లక్షల మంది పేదలకు ఉచితంగా బియ్యం.. పప్పు అందిస్తున్నాం. ఏపీలో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సొంత బాబాయ్ హత్య కేసుని మేం దర్యాప్తు చేయలేమని ప్రభుత్వం చేతులేత్తేసింది. పదో తరగతి బాలుడిని పెట్రోల్ పోసి చంపేశారు. అధికార పార్టీ ఎంపీ ఇంటిలో కిడ్నాపర్లు రెండు రోజులున్నారు. దశల వారీ మద్య నిషేధం సంగతేంటీ..? నాణ్యత లేని మద్యం సరఫరా చేసు మహిళల పుస్తెలు తెగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మద్యంలో భారీ ఎత్తున కుంభకోణం జరుగుతోంది. ప్రత్యేక హోదా వల్ల వచ్చే మేలు కంటే ఎక్కువ మేలు కేంద్రం చేస్తుంది. ప్రత్యేక హోదా వల్ల మేళ్లన్ని ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్‌తో నిన్న ఉన్నాం.. మొన్న ఉన్నాం.. రేపూ ఉంటాం. పోలవరం నిర్వాసితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. నిర్వాసితులపై క్లారిటీ వస్తే కేంద్రం దృష్టి సారిస్తుంది. పొత్తులు పార్టీ అధినాయకత్వం చూసుకుంటుంది. జనసేనతో సమన్వయం చేసుకుంటాం. పోలవరం నిర్మాణం చేతకాకుంటే కేంద్రానికి అప్పజెప్పండి.” అని పురంధేశ్వరి పేర్కొన్నారు.