ప్రస్తుత పరిస్దితుల్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధీశ్వరి అన్నారు. గురువారం ఆమె ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాలకు ఇచ్చే ఆదాయాన్ని గతంలో 32 శాతం ఇచ్చేవారు.. ప్రస్తుతం 42 శాతానికి కేంద్రం పెంచిందన్నారు. గతంలోనే ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అప్పటి సీఎం అంగీకరించారని పురంధీశ్వరి వెల్లడించారు. ఏపీకి ప్రస్తుతం కేంద్రం నుండి వస్తున్న వనరులు తప్పుదోవ పడుతున్నాయని ఆమె ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులతో జేబులు నింపుకోకుండా ప్రజలకు ఉపయోగించాలని, లిక్కర్ స్కాం విషయంలో ఈడీ తన పని తాను చేసుకుంటుందన్నారు.
Also Read : Rivaba Jadeja: భారీ విజయం దిశగా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. లీడింగ్‌లో “మోర్బీ” హీరో
బీజేపీకి ప్రజల ఆదరాభిమానాలు కొనసాగుతున్నాయని, అందుకే గుజరాత్ లో మరోసారి ప్రజలు బీజేపీని ఆశీర్వదించారన్నారు పురంధీశ్వరి. బీసీలకు న్యాయం చేశామంటున్న ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీ కులాలను విభజించు.. పాలించు అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, లిక్కర్ స్కాం వ్యవహారం నుండి ప్రజలను దారి మళ్లించేందుకే తెలంగాణా ప్రభుత్వం షర్మిలను అడ్డుకున్నట్లుగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో మహిళలు పట్ల తెలంగాణ ప్రభుత్వం చులకనభావంతో ఉందన్నారు పురంధీశ్వరి.