ISRO to Launch PSLV-C58 Mission Today: న్యూఇయర్ వేళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్దమైంది. నేడు పీఎస్‌ఎల్‌వీ-సీ58 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ58కి కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమవ్వగా.. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం ఉదయం 9:10 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.
పీఎస్‌ఎల్‌వీ-సీ58 ద్వారా మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్ రే పొలారి మీటర్ శాటిలైట్ (ఎక్స్‌పోశాట్) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. భారత అంతరిక్ష చరిత్రలో తొలి పొలారిమీటర్ మిషన్ ఇదే కావడం విశేషం. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం రాకెట్‌లో నాలుగో స్టేజ్ అయిన పీఎస్4.. అక్కడి నుంచి దిగువ కక్ష్యకు వస్తుంది. ఇందులో విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు ఉంటాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు.
Also Read: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి ఎక్స్‌పోశాట్ నాంది కానుంది. కాంతివంతమైన ఎక్స్-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్ లక్ష్యం. అంతేకాకుండా అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్‌పోశాట్ అధ్యయనం చేయనుంది. ఇందుకు గాను ఎక్స్‌పోశాట్‌లో రెండు అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్‌లను అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో గల భూ కక్ష్య నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. ఈ ఉపగ్రహ జీవితకాలం అయిదేళ్లు.