TG Vishwa Prasad Says I was lucky to work with Pawan Kalyan: తాను చిన్నప్పటి నుంచి ‘మెగాస్టార్’ చిరంజీవికి పెద్ద ఫ్యాన్‌ని అని, ఆయన్ని దూరం నుంచి చూస్తే చాలనుకున్నానని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ చెప్పారు. చిరు తమ్ముడు పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేసే అవకాశం తన అదృష్టమని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మళ్లీ మంచి రోజులొచ్చాయని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించారు.
విజయోత్సవ వేడుకలో టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ… ‘నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయనను దూరం నుంచి చూస్తే చాలనుకున్నా. అలాంటిది చిరు తమ్ముడు పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేసే అవకాశం దొరికింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన విజయం చారిత్రాత్మకం’ అని అన్నారు. 2003లో సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కాంబోలో ‘బ్రో’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంకు టీజీ విశ్వ ప్రసాద్ సహా వివేక్ కూచిభొట్ల నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో మారుతి, శ్రీవాస్, చందూ మొండేటి, శ్రీరామ్ ఆదిత్య, బన్నీ వాసు, ఆర్పీ పట్నాయక్, రామజోగయ్య శాస్త్రి, కృతి ప్రసాద్, హైపర్ ఆది, ఎస్‌కెఎన్, బాలాదిత్య, సప్తగిరి, మంగ్లీ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఓ రకమైన ఆనందంలో ఉన్నారని, ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి మాట్లాడుతున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయని దర్శకుడు మారుతి అన్నారు.