పండగ సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. టికెట్ రేట్లను వారికి ఇష్టం వచ్చినంత పెంచి వసూలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా.. ప్రైవేట్ టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. ఓ వైపు సంక్రాంతి.. మరోవైపు శనివారం, ఆదివారం కలిసి రావడంతో ఖర్చును సైతం లెక్క చేయకుండా సొంత ఊర్లకు వెళ్లడానికి జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్.. ప్రయాణికుల నుంచి అధికంగా డబ్బులు రాబడుతున్నారు.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు టికెట్ ధరలు వసూలు చేస్తున్నారు. ఓ రకంగా చూసుకుంటే.. విమాన టికెట్ లతో పోటీ పడుతున్నట్లు ఉంది ప్రైవేట్ బస్ చార్జీలు. ఏపీ వాసులు ఎక్కువగా సంక్రాంతికే ఊరు వెళ్తారు.. కావున 12, 13, 14 తేదీల్లో ట్రావెల్ బుకింగ్స్ కు భారీగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లాలంటే ఒక్కరికి రూ.5 వేల పైన చెల్లించాల్సిందే.. అంతేకాకుండా.. ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళాలన్నా.. రూ.3వేల నుంచి రూ.5వేలు సమర్పించాల్సిందే.
మరోవైపు.. స్లీపర్, సెమీ స్లీపర్ బస్సులకు డిమాండ్ పెరిగింది. ఈ లెక్కన చూసుకుంటే.. ఇంట్లో జరుపుకునే పండగ ఖర్చు కంటే.. ప్రయాణ ఖర్చులే ఎక్కువని ప్రయాణికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అధిక టికెట్ ధరల పై ఆర్టీఏ అధికారులు చోద్యం చూస్తున్నారు. మరోవైపు.. బస్సులకు డిమాండ్ పెరగడంతో వసూళ్లలో తగ్గేది లేదని ప్రైవేట్ ట్రావెలర్స్ అంటున్నారు. కాగా.. ప్రతి ఏడాది పండగల సీజన్ లో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడికి పాల్పడుతున్నారు. తెలంగాణ హైద్రాబాద్ నుంచి ఎక్కువగా విజవాడ, రాజమండ్రి, విశాఖ పట్నం, కాకినాడ, అమలాపురం, నర్సాపూర్, గుంటూరుకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు.