ప్రధాని మోదీ శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్ లో పర్యటించారు. అక్కడ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకం కింద పేద ప్రజలకు ఆయన చేతుల మీదుగా ఇళ్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోనే పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన అతిపెద్ద సొసైటీని నేడు ప్రారంభించామని తెలిపారు. 2014లో హామీ ఇచ్చానని.. ఆ వాగ్దానం నెరవేరడం, దాన్ని చూడటానికి రావడం.. ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మరోవైపు.. ఈ ఇళ్లను చూడగానే తనకు బాల్యం గుర్తొచ్చిందని పేర్కొన్నారు. చిన్నతనంలో తనకు కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అని ఆలోచించా అంటూ తన బాల్యాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లను దిగమింగుకుని భావోద్వేగానికి గురయ్యారు.
Read Also: Skill Development Case: సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ వాయిదా..
ఈ సందర్భంగా.. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం గురించి ప్రధాని ప్రస్తావించారు. జనవరి 22వ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో రామజ్యోతి వెలిగించాలని మరోసారి తెలిపారు. శ్రీరాముడి నిజాయితీని తమ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని ప్రధాని పేర్కొన్నారు. మన విలువలు, కట్టుబాట్లను గౌరవించాలని ఆ భగవంతుడు బోధించాడని తెలిపారు. అదే బాటలో నడుస్తూ పేదల సంక్షేమం, వారి సాధికారత కోసం పనిచేస్తున్నామని మోదీ చెప్పారు.
Read Also: Gadde Ramamohan: కేశినేని నాని టార్గెట్గా టీడీపీ ఎమ్మెల్యే విమర్శనాస్త్రాలు..
ప్రజల కలలే తమ ప్రభుత్వ హామీలని.. తమ పాలనలో చిట్టచివరి వ్యక్తికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో సంక్షేమ పథకాలు అందరికీ అందకపోవడంతో ‘గరీబీ హఠావో’ కేవలం నినాదంగా మిగిలిపోయిందని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.