President Murmu speech: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ముర్ము మాట్లాడుతూ.. ఆగస్టు 15 కేవలం స్వేచ్ఛా పండుగ మాత్రమే కాదని, ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కంటే గొప్పది ఏదీ లేదని అన్నారు. ప్రజాస్వామ్య మార్గంలో సవాళ్లు ఎదురైనప్పటికీ భారతదేశం విజయం సాధించిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల వల్లే 78 సంవత్సరాల క్రితం దేశానికి స్వేచ్ఛ వచ్చిందని అన్నారు.
READ MORE: UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు షాక్.. త్వరలో ఆ సేవలు బంద్!
ఆపరేషన్ సింధూర్ గురించి..
రాష్ట్రపతి ముర్ము ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఉగ్రవాదంపై మానవాళి పోరాటానికి ఉదాహరణగా ఆపరేషన్ సింధూర్ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. పహల్గాం దాడికి భారతదేశం తీసుకున్న నిర్ణయాత్మక, దృఢమైన ప్రతిస్పందన ఇదని, దీనితో మన సాయుధ దళాలు దేశాన్ని రక్షించడానికి ఏ పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని నిరూపించిందన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ప్రతి వయోజన పౌరుడికి ఓటు హక్కు ప్రసాదించిన ప్రజాస్వామ్య మార్గాన్ని మనం స్వీకరించామని గుర్తు చేశారు. దీని ద్వారా మన విధిని నిర్ణయించుకునే హక్కును మనమే ఇచ్చుకున్నామని అన్నారు. సవాళ్లు ఉన్నప్పటికీ, భారత ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విజయవంతంగా స్వీకరించారని, మనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అన్నింటికంటే ముఖ్యమైనవి అన్నారు.
ఆగస్టు 15 దేశ ప్రజల సమిష్టి జ్ఞాపకాలలో నిలిచిపోయే చారిత్రాత్మక తేదీ అని ఆమె పేర్కొన్నారు. సుదీర్ఘ వలస పాలనలో భారతీయులు తరతరాలుగా స్వేచ్ఛ గురించి కలలు కన్నారని అన్నారు. దేశంలోని ప్రతి మూల నుంచి ప్రజలందరూ విదేశీ పాలన సంకెళ్లను తెంచుకోవాలని శాంతియుత మార్గంలో పోరాడారని తెలిపారు. వారి పోరాటం అచంచలమైన ఆశావాదంతో నిండి ఉంది. ఇది స్వాతంత్ర్యం తర్వాత కూడా మన అభివృద్ధిని నడిపించిందని అన్నారు. రేపు మనం త్రివర్ణ పతాకానికి వందనం చేస్తున్నప్పుడు 78 సంవత్సరాల క్రితం ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన త్యాగధనులందరికీ కూడా నివాళులు అర్పిస్తామని అన్నారు.
READ MORE: Alaska sale history: అమెరికాకు అలస్కా బేరం.. ఎంతకు అమ్మారంటే..?