తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన సీనియర్ నటి ప్రేమ, తన వ్యక్తిగత జీవితం మరియు విడాకుల పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. దాదాపు మూడు దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఆమె, కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2006లో జీవన్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. అయితే, పదేళ్ల వైవాహిక జీవితం తర్వాత మనస్పర్థల కారణంగా 2016లో వారు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న ప్రేమ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల ప్రయాణం గురించి మనసు విప్పారు.
Also Read : Shambala :‘శంబాల’ సక్సెస్ మీట్లో.. ఆది సాయి కుమార్‌పై అల్లు అరవింద్ ప్రశంసలు
విడాకుల సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెబుతూ.. ‘నచ్చని బంధంలో ఇబ్బంది పడటం కంటే, బయటకు వచ్చి ప్రశాంతంగా బతకడం ముఖ్యం. దీని కోసం సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించవలసిన అవసరం లేదు. భరించేది మనం అయినప్పుడు నిర్ణయం కూడా మనదే కావాలి. చాలామంది అమ్మాయిలు చిన్న కష్టానికే ఆత్మహత్యల వైపు వెళ్తుంటారు. కానీ తాను ఆ కష్టాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాను. ఎందుకంటే మనుషులకే కష్టాలు వస్తాయి, వాటిని ఎదుర్కొన్నప్పుడే మనం స్ట్రాంగ్ అవుతాం’ అని ఆమె ధైర్యాన్ని తెలిపింది. అంతే కాదు
విడాకుల ప్రక్రియలో భాగంగా తాను కోర్టుకు కూడా ఒంటరిగానే వెళ్లానని ప్రేమ గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులు వస్తానన్నా వద్దని వారించి, తన పోరాటాన్ని తానే చూసుకున్నానని చెప్పారు.. ‘నిర్ణయాలు తీసుకునే శక్తి ఆడవాళ్లకు ఉంది. ముఖ్యంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ కూతుళ్లకు అండగా నిలబడాలి. ప్రపంచం చాలా పెద్దది, ఏదో ఒక పని చేస్తూ మనసును మళ్లించుకోవాలి కానీ, అదే జీవితం అనుకోని ఆగిపోకూడదు’ అని ఆమె హితవు పలికారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న ప్రేమ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి.