సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సామాజిక ఉద్యమకారుడు, బహుజనులకు ఆదర్శప్రాయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కులగణనతో పాటుగా 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. రైతుల సమస్యల పేరిట ఇక్కడ దీక్ష చేస్తున్న ఎంపి బండి సంజయ్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ముందు దీక్ష చేయాలని, బండి సంజయ్ ఓట్ల కోసం మొన్నటిదాకా రాముని ఫోటో పెట్టుకున్నారు, ఇప్పుడు రైతుల పేరిట ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. కాలేశ్వరం కుంగిపోతే నాలుగు నెలలుగా మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నాడని, 6) రాజకీయా డ్రామాలు పక్కనపెట్టి రాష్ట్రంలో కరువు పరిస్థితుల దృష్ట్యా కేంద్రం నుండి బండి సంజయ్ నిధులు తేవాలన్నారు పొన్నం ప్రభాకర్.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వందరోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని, కాంగ్రెస్ వల్లే కరువు పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని కేసిఆర్ ఆరోపించడం అర్థరహితమన్నారు. కరువు పరిస్థితులకు, రాజకీయాలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. శాసనసభ ఎన్నికల అనంతరం నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చిన కేసిఆర్ సాగు, తాగునీటి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాది ఆగస్టు మాసంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, నాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేశారు. ఎల్ నినో కారణంగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని జలాశయాల్లో ఉన్న నీటిని సాగు, తాగు అవసరాలకు ఎలా వాడుకోవాలో అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు.