కాలేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర కమిషన్ రిపోర్ట్ వచ్చాక చట్టపరమైన చర్యలు తప్పవని, ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదలం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. కాలేశ్వరం విచారణలో ఎలాంటి రాజకీయ కక్ష వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే.. అందులో ఎవరి పాత్ర ఉంటే వారిపైనే చర్యలు ఉంటాయన్నారు. జాతిపితగా ప్రకటించుకునే వ్యక్తి దర్యాప్తు సంస్థ ముందు విచారణకు వచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ పథకాలు పెద్ద స్కామ్ అని పొంగులేటి మండిపడ్డారు. ములుగు జిల్లాలో మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
‘తెలంగాణ రాష్ట్రంలో మూడు అంశాల్లో దోచుకోవడం పెట్టుకున్నారు. కాలేశ్వరాన్ని ఎనిమిదవ వింతగా చూపించారు. గొప్ప ప్రాజెక్టుగా చెప్పిన కాలేశ్వరం వాళ్లున్న (బీఆర్ఎస్) సమయంలోనే కూలిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కాలేశ్వరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కాపాడే ప్రయత్నం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేసారు. రాష్ట్ర సంస్థలతో విచారణ జరిపితే పొలిటికల్, తప్పుడు ప్రచారాలు జరుగుతాయని కేంద్ర సంస్థతో విచారణ చేపట్టారు. కాలేశ్వరం నిర్మాణంలో ఉన్న లోపాలు బయటపడ్డాయి. ప్రాజెక్టు పేరుతో పింక్ కలర్ కుట్రని ఛేదించేందుకు కమిషన్‌ని నియమించింది. కేంద్ర సంస్థ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా జడ్జితో కమిషన్ వేసి పూర్తి వివరాలు తెలుసుకుంటూ ఉంటే.. దాన్ని తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. తనకు తాను తెలంగాణ జాతిపితగా చెప్పుకునే పెద్ద మనిషి కూడా విచారణ హాజరు కావాల్సి వచ్చింది’ అని మంత్రి పొంగులేటి విమర్శించారు.
Also Read: Revanth Reddy: నేను ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదు!
‘కమిషన్ రిపోర్టు ఆధారంగా దీని వెనక ఎంత పెద్ద వాళ్లు ఉన్నా.. వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. పేదోడు సొమ్ము తిన్న వాళ్లు ఎంత పెద్ద వాళ్లు ఉన్నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాలేశ్వరం విచారణలో ఎలాంటి రాజకీయ కక్ష వేధింపులు ఉండవు. కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే ఇందులో ఎవరి పాత్ర ఉంటే వారిపైనే చర్యలు ఉంటాయి. మిషన్ భగీరథలో దోచుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ భూములు అమ్ముకున్నారు. ఒక్కదాని తర్వాత మరొక దానిపై విచారణలు ఉంటాయి. ఇప్పుడు కాలేశ్వరంపై విచారణ కొనసాగుతుంది. వీటన్నింటితోటే ముడిపడిన అంశం ఫోన్ టాపింగ్. అందులో కూడా విచారణ జరుగుతుంది. అసలైన దోషులు ఎవరో త్వరలోనే తేలుతుంది’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.