Ponguleti Srinivas Reddy : పశువైద్యశాల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ఆర్థిక కష్టాలు ఉన్నా అభివృద్ధి పనులు ఆపకుండా, ప్రజలకు సంక్షేమ పథకాలు నిరాటంకంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు అసలు, వడ్డీ కలిపి ఇప్పటివరకు రూ.6,500 కోట్లు చెల్లిస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని వివరించారు.
ముఖ్యంగా రైతుల విషయంలో ప్రభుత్వం పెద్ద పీట వేసిందని చెప్పారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రూ.17,000 కోట్లు రుణమాఫీ చేసిన దానికంటే, ఇందిరమ్మ ప్రభుత్వం కేవలం 9 నెలల్లోనే రూ.21,000 కోట్లు మాఫీ చేసి 25 లక్షల 65 వేల మంది రైతన్నలకు లబ్ధి చేకూర్చిందని తెలిపారు. అంతేకాదు, రైతులు పండించిన సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ అందించిన ఘనత కూడా ఇందిరమ్మ ప్రభుత్వదేనన్నారు. రైతు భరోసా పథకాన్ని గత ప్రభుత్వంతో పోలిస్తే మరింత మెరుగైన విధంగా అమలు చేశామన్నారు. త్వరలోనే మళ్లీ రైతులకు రైతు భరోసా అందించనున్నట్లు ప్రకటించారు.
గత ప్రభుత్వం చేసిన మొత్తం రూ.8.19 లక్షల కోట్ల అప్పుల బాధ్యతను తమ ప్రభుత్వం మోస్తూనే, రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల సంక్షేమం అందిస్తున్నామని పేర్కొన్నారు. అర్హత కలిగిన పేదవారికి విడతల వారిగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మించి అందిస్తామని హామీ ఇచ్చారు. చివరగా, ప్రజల మద్దతు లేకుండా రాజకీయంగా హడావుడి చేసే నేతలకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని, ప్రజలే వారిని తిరస్కరిస్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగా ముజ్జుగూడెంలో ఏర్పాటైన పశువైద్యశాల నిర్మాణం, విధులపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
Annamayya District: “అమ్మా.. నేనేం పాపం చేశా”.. గడ్డివాములో దొరికిన పసికందు