Hyderabad Polling Percentage: తెలంగాణలో ఓటర్లు పోలింగ్ బూతులకు తరలివెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే.. హైదరాబాద్ జనం మాత్రం మారలేదు. ఎప్పటిలాగే నగరవాసులు ఓటు వేసేందుకు కదల్లేదు. గత ఎన్నికల్లో అత్యల్పంగా హైదరాబాద్‌లోనే ఓటింగ్ నమోదు అయ్యింది. అయితే ఈ సారి కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. కొందరు ఉదయమే లేచి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నా.. ఓవరాల్ గా సీన్ మారలేదు. హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు నమోదైన పోలింగ్ శాతం చూస్తే.. కేవలం 20.79 శాతం మాత్రమే ఉంది. పోలింగ్ జరుగుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలతో పాటు.. అన్ని సంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించింది. అయితే చాలామంది ఓటర్లు మాత్రం సెలవు రోజు కూడా ఇల్లు కదలడానికి ఇష్టం పడలేదు. మరి ఓటు వేయడానికి ఇంత సోమరితనం ఎందుకు? ఓటు అనేది మన హక్కు. ఓటుపై ప్రతీసారి ఎన్నికల కమిషన్ సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. అయినా కూడా చాలామంది హైదరాబాదీలు ఓటు వేయడానికి ముందుకు రాలేదు.
కరెంట్ పోతే గొడవ చేస్తారు. ట్రాఫిక్ జామ్ అయితే రచ్చ చేస్తారు. ప్రతి చిన్న సమస్యపై ఇంట్లో కూర్చుని ట్వీట్లు పెడతారు. కానీ ఓటు విషయానికి వచ్చేసరికి.. హైటెక్ సిటీ ప్రజలు ఆసక్తి చూపడంలేదు. ఓటుపై సమావేశాలు, డిజిటల్ ప్రచారాలతో పాటు. అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఓటును వారి ఇంటికి దగ్గర్లో ఉన్న పోలింగ్ బూత్‌కు మార్చుకునేలా కూడా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ అధికారులు కూడా గేటెడ్ కమ్యూనిటీల నివాసితుల నుంచి మెరుగ్గా పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయినా సరే పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. విద్యాధికులు, ఉద్యోగులు అధికంగా ఉండే నగరాల్లో ఓటు చైతన్యం కొరవడుతోంది. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువుంటుంది. ఐదేళ్ల పాటు మనల్ని పాలించేవారిని ఎన్నుకోవడంలో ఓటు పాత్ర కీలకం. అయితే ఈ కీలక పాత్రను నేటి యువత విస్మరిస్తోంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని చైతన్య, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఓటు వేయడంలో మాత్రం నగర యువత బద్దకిస్తోంది. హైటెక్‌సిటీగా పేరొందిన మన భాగ్యనగరంలో దాదాపు 55 శాతం మంది యువత ఓటు విషయంలో అనాసక్తి చూపుతున్నారని ఓ సంస్థ సర్వేలో వెల్లడవడం ఆందోళన కలిగిస్తోంది.
ఎన్నికల సంఘం, పలు స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు చైతన్యం పెరుగుతోంది. అయితే.. మెట్రో నగరాల్లో మాత్రం ఈ చైతన్యం పూర్తిగా కొరవడుతోంది. మరీ ముఖ్యంగా మెట్రో యువత ఓటువేయడాన్ని తమకు సంబంధం లేని అంశంగా చూస్తున్నారని తాజాగా జరిపిన సర్వేలో వెల్లడైంది. నగరాల్లో ఉంటున్న వారు.. తమ ఓటుహక్కు నమోదు, ఓటేయడం,ఓటరు ఐడీకార్డును పొందడం వంటి విషయాల్లో వెనుకంజలో ఉన్నట్లు తేలింది. ఆన్‌లైన్ సర్వే ప్రకారం.. ఓటరు నమోదు, ఓటరు ఐడీకార్డులను పొందడం, ఓటు వేసేవారు బెంగళూరులో 53 శాతం మేర ఉన్నట్లు వెల్లడైంది. ఇక 52 శాతంతో పుణే, ముంబైలు రెండోస్థానంలో నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీలో 47శాతం మంది మాత్రమే ఈ అంశాలపై ఆసక్తి చూపారు. హైదరాబాద్‌లో అయితే చాలా తక్కువగా కేవలం 45 శాతం మందే ఓటింగ్ విషయంలో ఆసక్తిగా ఉన్నట్లు తేలింది.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ మెట్రో నగరాలకు వలసొస్తున్న వారిలో 91 శాతం మంది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఆసక్తిచూపడం లేదు. మెట్రో నగరాల్లో నివసిస్తున్న యూత్‌లో 75శాతం మందికి తమ ఓటును ఎలా నమోదు చేసుకోవాలన్న అంశంపై అవగాహన కొరవడింది. వివిధ అవసరాల నిమిత్తం మెట్రో నగరాల్లో నివసిస్తున్న యువతలో 60శాతం మంది తాము నివసిస్తున్న సిటీలో ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. 40 శాతం మంది ఓటర్ ఐడీ ఉంటే దేశంలో ఎక్కడైనా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని నమ్ముతున్నారు. గ్రేటర్‌లో నెటిజన్లుగా మారిన మెజారిటీ హైటెక్ సిటిజన్లు..గతంలో జరిగిన పలు ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే విషయంలో దూరంగా ఉన్నారనేది సుస్పష్టం. మహానగరం పరిధిలో గతంలో పలు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో రాష్ట్రస్థాయి సగటుతో పోలిస్తే పోలింగ్ శాతం తక్కువగా నమోదవడం పట్ల ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్‌లో సుమారు 24 నియోజకవర్గాల పరిధిలో 77 లక్షల మందికి పైగా ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో తమ ఓటుహక్కు వినియోగించుకునేవారు మాత్రం చాలా తక్కువ. ఈ విషయం. గత సార్వత్రిక ఎన్నికలు, బల్దియా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది. పోలింగ్ జరిగే రోజును సెలవుదినంగా భావిస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, మార్కెటింగ్ తదితర రంగాల ఉద్యోగులు, వేతనజీవులు పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు.
మహానగరం పరిధిలో 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 58శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో అంతకంటే తక్కువగా కేవలం 53 శాతం మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని 15 నియోజకవర్గాల్లో కేవలం 48.89 శాతం మంది మాత్రమే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇంకా చెప్పాలంటే నగరీకరణ పెరుగుతున్న కొద్దీ.. ఓటింగ్ శాతం తగ్గిపోతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రేటర్లో కలవక ముందు మెరుగైన ఓటింగ్ శాతం నమోదు చేసిన శివారు ప్రాంతాలు.. గ్రేటర్లో కలవగానే.. హైదరాబాద్ లక్షణాలు అలవర్చుకుంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు ఓటింగ్‌కు దూరం జరిగారు. జనరల్ ఎలక్షన్, అసెంబ్లీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు…ఎన్నికలు ఏవైనా సరే.. ఒకేలా ఉంటోంది నగర ఓటర్ల తీరు. ఈ సారైనా.. అనుకున్న వాళ్ల ఆశల్ని తునాతునకలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తితే..నగరాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు నిర్మానుష్యంగా కనిపించాయి. ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లు, సంపన్నులు, సెలబ్రిటీలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సోషల్ మీడియాలో వీరోచిత రాతలు రాసేవాళ్లు.. ఉన్నత వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాల్లోనే ఓటింగ్ తగ్గుతున్న తీరు ప్రజాస్వామ్య వాదులని ఆందోళనలో పడేస్తోంది.
ఓటు హక్కు ఊరికే రాలేదు. పోరాడితే వచ్చింది. కొన్ని దేశాల్లో ఓటు హక్కు కోసం ఇప్పటికీ పోరాటాలు జరుగుతున్నాయి. ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే, ఓటు వేసే అవకాశం రాకపోతే.. తాము చనిపోయినట్లే అని భావించే వాళ్లు మన దేశంలో ఉన్నారు. ఓటు హక్కు ఉన్నవారంతా ఓటు వేయాలని ఎన్నికల కమిషన్ చాలా ఏర్పాట్లు చేస్తోంది. నగరాల్లో ఓటింగ్ శాతం తగ్గడంలో ఓటర్లతో పాటు పార్టీలు, నాయకులకీ బాధ్యత ఉంది. ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల యుద్ధాలు, పరస్పర ఆరోపణలు, దూషణభూషణలు, తిట్ల దండకాలు, పోలింగ్ ముందు రోజు ప్రలోభాలు, పోలింగ్ రోజు గొడవలు లాంటి అనేక అంశాలు విద్యాధికుల్లో ఎన్నికలంటేనే విరక్తి కలిగేలా చేస్తున్నాయి. అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గడం కేవలం హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. ఓటింగ్ పెంచేందుకు ఎన్నికల కమిషన్, స్వచ్చంధ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా తయారయ్యాయి. ఓటింగ్ శాతం ప్రతీసారి ఆందోళనకరమైన రీతిలో తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి హానికరం. అయితే ఏవో కొన్ని కారణాలు చెప్పి.. మొత్తంగా ఓటు వేసే ప్రక్రియకు దూరం కావడం విజ్ఞతేనా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.