లక్నో: మనదేశంలో ఇప్పటికీ రకరకాల సెంటిమెంట్లను నమ్మేవారు ఉన్నారు. ఇలాంటి వాటిని కొందరు మూఢనమ్మకాలు అంటుంటే కొందరు మాత్రం వాటిని గుడ్డిగా నమ్ముతున్నారు. వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడిగితే ఆ పని జరగదని, తుమ్మితే మంచిది కాదని, మంగళవారం మంచి రోజు కాదని, పిల్లి ఎదురుపడితే అపశకునమని చాలా మంది ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. అయితే ఇలాంటి సెంటిమెంట్లు చెడు పనులు చేసే దొంగలు కూడా ఉన్నాయంటే నమ్మడం కొంచెం కష్టమే. అయితే ఇలాంటి నమ్మకమే ఎప్పటి నుంచో పోలీసులకు చుక్కులు చూపిస్తున్న ఓ దొంగల ముఠాను పట్టించింది. నమ్మడానికి కొంచెం వింతగా అనిపిస్తున్న ఇది నిజం.
అసలు విషయంలోకి వెళ్తే ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఓ వింత సంఘటన జరిగింది. ఈ మధ్య యూపీలోని ఝాన్సీలో ఓ దొంగల ముఠా పలు దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చుక్కలు చూపెడుతోంది. వారిని పట్టుకోవడానికి ఖాకీలు ఎంత ప్రయత్నించినా వారి వల్ల కావడం లేదు. అయితే వారి వల్ల కానీ పనిని ఓ పిల్లి చేసింది. వినడానికి వింతగా అనిపించినా అసలు విషయం తెలిస్తే మాత్రం నవ్వాగదు. ఓ చోట దొంగతనం చేసి దొంగలు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు.దొంగతనం చేసి పారిపోతున్న ఆ దొంగల ముఠాకు పిల్లి ఎదురురావడంతో అపశకునంగా భావించిన దొంగలు పారిపోకుండా కొద్దిసేపు ఆగిపోయారు. దీంతో ఇంకేముంది వారు పోలీసుల చేతికి దొరికిపోయారు. దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి డబ్బు, నగలను స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు దొంగలు ఈ దొంగతనానికి పాల్పడగా వారిని మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాకు చెందిన అమిత్ పాఠక్ సోను, సైనిక్, రాహుల్ సేన్‌గా గుర్తించారు. ఆ దొంగల నుంచి కాజేసిన సొమ్మును, నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దొంగలను విచారించగా వారిలో ఓ దొంగ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. దొంగతనం చేసి వస్తూ ఉండగా అటుగా ఓ పిల్లి వెళుతుందని తెలిపాడు. దీనిని అపశకునంగా భావించిన తాము పారిపోకుండా కొద్దిసేపు కదలకుండా అక్కడే ఉండిపోయినట్లు పోలీసుల విచారణలో ఆ దొంగ తెలిపాడు. పలు దొంగతనాలు పాల్పడిన ఈ ముఠాను పట్టుకునేందుకు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నించిన పోలీసులు చివరికి వారిని అరెస్ట్ చేశారు. ఝాన్సీలో జరిగిన పలు దొంగతనాలతో వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ వార్తను చదివిన చాలా మంది దొంగల అపశకునం పోలీసులకు శుభశకునంలా మారిందని అనుకుంటున్నారు. ఈ కాలంలో కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఉంటాయా, అయినా దొంగలు కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్ముతారా అంటూ మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా పిల్లి పోలీసుల పనిని సులభం చేసిందని ఆ పిల్లిని ప్రశంసిస్తు్న్నారు మరికొందరు.