భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. ఓ వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మరోవైపు డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదు అవుతుండడంతో.. ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. ఓవైపు నివారణ చర్యలను పూనుకుంటూనే.. మరోవైపు.. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది.. ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుండగా.. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశానికి సిద్ధం అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగబోతోంది.. ఈ నెల 9వ తేదీన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం కోవివ్ పరిస్థితి, వ్యాక్సినేషన్, ఇతర అంశాలపై కీలకంగా చర్చించిన ప్రధాని మోడీ.. జిల్లా స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని, కరోనాకు చెక్ పెట్టేందుకు టీకానే ఉత్తమ మార్గమని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఇవాళ జరిగే సీఎంలపై భేటీలో.. కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: ‘సురేంద్ర పురి’ కుందా సత్యనారాయణ కన్నుమూత
కాగా, భారత్‌లో నిన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 1,94,720కు చేరింది.. మరో 442 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.. ఈ తరుణంలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత పెరుగుతున్న కోవిడ్-19 కేసులపై ప్రధాని మోడీ సమావేశం కీలకంగా మారనుంది.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ మరియు గుజరాత్‌లో ఆందోళనకర స్థాయిలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు భారీగానే వెలుగుచూస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించడంతో.. రాష్ట్రాలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వనున్నారు.. కోవిడ్ కట్టడిపై మరింత కఠినంగా వ్యవహరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.