PM Narendra Modi: గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని మొధేరాను తొలి సంపూర్ణ సోలార్ గ్రామంగా ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు సూర్యదేవాలయం ఉన్న గ్రామంగా మొధేరా ప్రసిద్ధి చెందిందని.. ఇప్పటి నుంచి సూర్య గ్రామంగా పిలుస్తారని ప్రధాని మోడీ వెల్లడించారు. మొధేరాకు ఇది గొప్పరోజని ఆయన తెలిపారు. మహిమాన్విత వారసత్వంతో కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంలో మొధేరా యావత్ దేశానికి ఉదాహరణగా నిలిచిందని ఆయన అన్నారు. మొధేరాలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన సభను ఉద్దేశించి ప్రసగించారు. ప్రజలకు శరద్ పూర్ణిమ, వాల్మీకి జయంతి శుభాకాంక్షలు చెప్పారు. గుజరాత్ పర్యటన సందర్భంగా రూ.14,600కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు/ప్రారంభోత్సవాలు చేశారు.
దేశంలో సమృద్ధిగా ఉన్న సహజ వనరులను ఉపయోగించుకోవడం, పునరుత్పాదక ఇంధనాన్ని మరింత పోత్సహించడం ద్వారా ప్రపంచానికి ఇంధన ప్రదాతగా మారడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మెహసానా ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని ఆయన తెలిపారు. మహళలు నీటి కోసం చాలా దూరం నడవాల్సి వచ్చేదన్నారు. గతంలో కరెంటు కొరత ఉందని, అయితే నేటి కొత్త తరంలో ఈ సమస్యలు లేవని అన్నారు. ఇప్పుడు మొధేరా ప్రజలు విద్యుత్తు కోసం చెల్లించాల్సిన అవసరం లేదని, అయితే వారు దానిని విక్రయించడం ప్రారంభించి దాని నుంచి సంపాదించవచ్చని ప్రధాని అన్నారు. గతంలో కరెంటు లేకపోవడం వల్ల చదువు, ఇంటి పనుల్లో ఎన్నో ఆటంకాలు, సమస్యలు ఉండేవని, ఇప్పుడు సౌరశక్తి కొత్త భారత్‌ను క్రమబద్ధీకరించిన లక్ష్యాన్ని సాధించేందుకు శక్తినిస్తుందని అన్నారు.
ఒకప్పుడు సైకిళ్లను తయారు చేయలేని రోజుల నుంచి నేడు గుజరాత్ కార్లు, మెట్రోకోచ్‌లను తయారు చేసే స్థాయికి ఎదిగిందన్నారు. త్వరలోనే గుజరాత్ విమానాలను తయారు చేసే రోజు ఇంకెంతో దూరంలో లేదని మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్ ప్రభుత్వం ప్రకారం, గ్రామంలోని ఇళ్లపై 1000కి పైగా సౌర ఫలకాలను అమర్చారు, గ్రామస్తుల కోసం 24 గంటలూ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. వారికి జీరో ఖర్చుతో సౌర విద్యుత్‌ను అందించడం గమనార్హం. భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచాలనే ప్రధాన మంత్రి దార్శనికతను దృష్టిలో ఉంచుకుని, గుజరాత్‌లో వివిధ సంక్షేమ పథకాలను స్థిరంగా అమలు చేసేందుకు తాము హామీ ఇచ్చామని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.