PM Modi: భారతదేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విమానాల ఆలస్యం, రద్దులు పెరగడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి తీవ్రతను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ఇక, తాజాగా, ఇండిగో సంక్షోభంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండిగో సంస్థ సంక్షోభంపై ఇప్పటికే సమగ్ర నివేదికను ప్రధానికి అందించారు. దీంతో ప్రస్తుత పరిస్థితిని పీఎంఓ నేరుగా పర్యవేక్షిస్తూ.. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్తో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తుంది.
Read Also: TGSRTC : ఇండిగో సంక్షోభం నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
ఇక, విమానాలు భారీ సంఖ్యలో రద్దు, ఆలస్యాలు, సిబ్బంది కొరత వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుండటంపై పీఎంవోకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ పరిస్థితిని వివరించారు. తమ కార్యకలాపాలను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకురావడానికి 10 రోజుల గడువు ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. ఇండిగో విమానాల ఆలస్యంతో కస్టమర్లు ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఇండిగోపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రూల్స్ ఉల్లంఘన, ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలు, ఆపరేషనల్ ల్యాప్సులు లాంటి అంశాలపై ఇండిగోపై విచారణ కొనసాగుతోంది. భారీ మొత్తంలో కేంద్రం జరిమానాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.