ప్రపంచానికి పచ్చని (Green), స్వచ్ఛమైన (Clean), సాంకేతిక పరిజ్ఞానం (Tech Savvy) ఉన్న ప్రభుత్వాలు అవసరమని ప్రధాని మోడీ (PM Modi) ఆకాంక్షించారు. యూఏఈలో (UAE) రెండ్రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రెండోరోజు మోడీ పర్యటన కొనసాగుతోంది. దుబాయ్‌లో జరిగిన ప్రపంచ ప్రభుత్వ సదస్సులో మోడీ ప్రసంగించారు. ప్రపంచానికి స్వచ్ఛమైన, ఆకుపచ్చ మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రభుత్వాలు అవసరమని మోడీ నొక్కి చెప్పారు.
అలాగే ప్రపంచానికి అంటువ్యాధులు లేని ప్రభుత్వాలు అవసరమని స్పష్టం చేశారు. భారతదేశంలోని ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారని చెప్పుకొచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరిగిందని.. బీజేపీ యొక్క ఉద్దేశం.. నిబద్ధతపై ప్రజలకు నమ్మకం ఉందని తెలిపారు. పాలనలో ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైందని మోడీ పేర్కొన్నారు.
రెండురోజుల పర్యటన నిమిత్తం మోడీ మంగళవారం యూఏఈలోని అబుదాబికి (Abu Dhabi) చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో మోడీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. అలాగే ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. భారతీయులు-యూఏఈతో మంచి సంబంధాలు కోరుకుంటున్నారని మోడీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఈ రోజు అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని మోడీ ప్రారంభించనున్నారు.