Delhi Police: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి AI వీడియోపై అప్‌లోడ్ చేసిన కాంగ్రెస్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ పార్టీ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఐటీ సెల్‌ను ప్రధాన నిందితులుగా చేర్చారు. పలు సెక్షన్లు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బీజేపీ ఫిర్యాదు..
సెప్టెంబర్ 12న బీజేపీ ఢిల్లీ ఎన్నికల విభాగం కన్వీనర్ సంకేత్ గుప్తా పోలీసులకు ప్రధాని మోడీ తల్లి ఏఐ వీడియోపై ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో సెప్టెంబర్ 10న డీప్‌ఫేక్/AI జనరేటెడ్ వీడియోను పోస్ట్ చేసిందని పేర్కొన్నారు. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, వారి చనిపోయిన తల్లితో చూపించారని, దీని ద్వారా ఆయన ఇమేజ్, గౌరవం దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటన భారతదేశ అత్యున్నత రాజ్యాంగాన్ని అవమానించడమేనని, ముఖ్యంగా మహిళల గౌరవాన్ని, మాతృత్వాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. ఇది ప్రజాస్వామ్య సంస్థలపై దాడి అని, సమాజంలో అశాంతి, ద్వేషం, అబద్ధాలను వ్యాప్తి చేసే ప్రయత్నం అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని, ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని ఆయన కోరారు.
READ ALSO: Dalapathi Vijay: ‘ఐ యామ్ కమింగ్’ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన దళపతి విజయ్