All You Need To Know About Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద భవనం, వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేసిన ‘సూరత్ డైమండ్ బోర్స్’ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. ప్రధాని రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా నేడు సూరత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సూరత్ డైమండ్ బోర్స్ (ఎస్‌డీబీ) భవన సముదాయాన్ని ఆరంభించారు. అంతర్జాతీయ డైమండ్, జ్యూవెలరీ వ్యాపారానికి ప్రపంచంలోనే అతిపెద్ద, ఆధునిక కేంద్రంగా ఎస్‌డీబీ వెలుగొందనుంది. ఎస్‌డీబీతో మరో 1.5 లక్షల మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని ప్రధాని అన్నారు. ఈ భవన సముదాయం నవీన భారత శక్తి, సంకల్పానికి చిహ్నంగా నిలుస్తుందన్నారు.
వజ్రాలు, వజ్రాభరణాల అంతర్జాతీయ వ్యాపారానికి ఎస్‌డీబీ కేంద్రంగా నిలవనుంది. శుద్ధి చేసిన, ముడి వజ్రాల వ్యాపారానికి ఈ భవనం అంతర్జాతీయ కేంద్రంగా మారనుంది. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది. ఆభరణాల రిటైల్ వ్యాపారులు తమ విక్రయ కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అంతర్జాతీయ బ్యాంకింగ్, సురక్షిత లాకర్ల సదుపాయం కూడా ఈ భవనంలో ఉంటుంది. డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ సిటీలో భాగంగానే ఎస్‌డీబీని నిర్మించారు. 2015 ఫిబ్రవరిలో ఈ భవనం ప్రారంభం కాగా.. 2022లో పూర్తయింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయంగా గిన్నీస్ రికార్డ్స్ గుర్తించింది.
అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఎస్‌డీబీని గుజరాత్‌లోని సూరత్ నగరానికి సమీపంలోని ఖాజోడ్ గ్రామంలో నిర్మించారు. రూ.3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఎస్‌డీబీలో మొత్తం తొమ్మిది భవనాలు ఉన్నాయి. ఒక్కో దాంట్లో 15 అంతస్తులు నిర్మించారు. ఈ సముదాయాల్లో 300 చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు ఉన్నాయి. దీంట్లో దాదాపు 4500 కార్యాలయాలు ఉన్నాయి. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుంది. నాలుగు వేల సీసీ కెమెరాలతో పాటు స్మార్ట్ గేట్లతో భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
Also Read: IND vs SA: విజృంభించిన అర్ష్‌దీప్, అవేశ్.. 116 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్!
సూరత్ నగరం వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి అన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వజ్రాలను సానబెట్టడం, పాలిష్ చేయడం వంటి 90 శాతం కార్యకలాపాలు సూరత్‌లో జరుగుతుంటాయి. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఎస్‌డీబీతో వజ్రాల వ్యాపారం మరింత విస్తరించనుంది. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒకే గొడుగు కిందకు తెచ్చినట్లవుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని, ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని నిపుణులు అంటున్నారు.