South Africa All-Out for 116 Runs in SA vs IND 1st ODI: జొహానెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (5/37), అవేశ్ ఖాన్ (4/27) చెలరేగడంతో దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఆండిలే ఫెలుక్వాయో (33; 49 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) టాప్ స్కోరర్. టోనీ డి జోర్జి (28), ఎయిడెన్ మార్‌క్రమ్ (12), తబ్రైజ్ షంసి (11 నాటౌట్) డబుల్ డిజిట్ స్కోరు చేశారు. ప్రొటీస్ మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి రీజా హెండ్రిక్స్ (0) బౌల్డ్ కాగా.. ఆ మరుసటి బంతికే రస్సీ వాండర్ డసెన్ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ సమయంలో కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ (12)తో కలిసి ఓపెనర్ టోని డి జోర్జి (28) మూడో వికెట్‌కు 39 పరుగులు జోడించాడు. అర్ష్‌దీప్ వేసిన 8వ ఓవర్ ఐదవ బంతికి కీపర్ క్యాచ్ ఇచ్చి టోని వెనుదిరిగాడు. తన తర్వాతి ఓవర్లో ప్రమాదకర హెన్రిచ్ క్లాసెన్ (6) ను అర్ష్‌దీప్ బౌల్డ్ చేయడంతో ప్రొటీస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది.
Also Read: P Chidambaram: కాంగ్రెస్ ఓటమిని ఊహించలేదు: చిదంబరం
ఆపై అవేశ్ ఖాన్ మాయ మొదలైంది. అవేశ్ వేసిన 11వ ఓవర్ తొలి బంతికే ఎయిడెన్ మార్క్‌రమ్ బౌల్డ్ అవగా.. తర్వాత బంతికే వియాన్ మల్డర్ (0) ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ సమయంలో ఆండిలే ఫెలుక్వాయో వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వేగంగా పరుగులు చేస్తూ దక్షిణకాఫ్రికా స్కోరు సెంచరీకి చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కేశవ్ మహారాజ్ (4)ను అవేశ్ ఖాన్ ఔట్ చేయగా.. పెహ్లుక్వాయోను అర్ష్‌దీప్ పెవిలియన్‌కు పంపాడు. నంద్రె బర్గర్ (32 బంతుల్లో 7)ను కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేయడంతో సఫారీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఫెలుక్వాయో దూకుడుగా ఆడటంతో దక్షిణాఫ్రికా ఈ మాత్రం స్కోరునైనా చేయగలిగింది. ఈ వన్డేలో భారత పేసర్లు 9 వికెట్లు పడగొట్టారు.