Tomato Price Drop: ప్రస్తుతం టమాటా రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. భారీగా టమాటా ధరల పతనం కావడంతో రైతులు వాటిని అమ్ముకోలేక చివరకు పంట మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని మెదక్ జిల్లా, శివంపేట మండలం, నవాబుపేట గ్రామంలో రైతు రవిగౌడ్ హృదయవిదారక సంఘటనకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన రైతు రవిగౌడ్ నాలుగు ఎకరాల్లో టమాటా పంటను సాగు చేశారు. అయితే మార్కెట్లో టమాటా ధరలు పూర్తిగా పఠనం కావడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రస్తుతం టమాటా బాక్స్‌కు 50 రూపాయల ధర మాత్రమే ఉంటుంది. పంటను విక్రయించినా కూలీల ఖర్చు కూడా రాకపోవడంతో తాను తీవ్ర నిరాశ చెందినట్లు రైతు తెలిపారు.
ఈ పరిస్థితులలో టమాటా పంటను విక్రయించలేని కారణంగా, తన పంటను పూర్తిగా కోసి రవిగౌడ్ తగలబెట్టాడు. ఈ పరిస్థితి ప్రతి రైతు దుస్థితిని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం రవిగౌడ్ సమస్య కాదు. పంటకు తగిన ధరలు లేకపోవడంతో మరికొంతమంది రైతులు కూడా తమ పంటను కోయకుండా పొలంలోనే వదిలేస్తున్నారు. రైతుల కష్టానికి గిట్టుబాటు ధర అందకపోవడం వల్ల వారిలో ఆవేదన పెరిగిపోతుంది. ఈ పరిస్థితి ప్రభుత్వ దృష్టికి వెళ్లి, టమాటా వంటి పంటలకు న్యాయమైన ధరలను కల్పించే చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుకుంటోంది. ఈ సంఘటన రైతుల సమస్యలను అర్థం చేసుకుని, వారికి అవసరమైన మద్దతు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మరో హెచ్చరికను గుర్తు చేస్తుంది.