ప్రభుత్వ పథకం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వం పథకం రూపొందించిందని, పట్టణ (మున్సిపాలిటీల పరిధి) రైతు కూలీలకు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని శ్రీనివాస్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు హాజరయ్యారు.
Also Read: Ration Cards: రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!
తెలంగాణ రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీల్లో మొత్తంగా 8 లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారని పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. గ్రామాల్లోని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి.. మున్సిపాలిటీల్లోని వారికి ఇవ్వకపోవడం ఏమాత్రం సరికాదన్నారు. రైతు కూలీలు అందరూ సమానమేనని, ఎక్కడ ఉన్నా అందరూ కూలీలే అని పేర్కొన్నారు. కేవలం గ్రామాల్లోని రైతు కూలీలకే పథకం వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ అన్నారు. ఈ పిటిషన్‌పై 4 వారాల్లో తుది నిర్ణయం వెల్లడించాలని తెలంగాణ ప్రభుత్వంను హైకోర్టు ఆదేశించింది.