గతంలో ఎవ్వరూ రేషన్ కార్డులు ఇవ్వలేదనట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోందని, రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమా? అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు లక్షల యాబై వేల రేషన్ కార్డులు ఇచ్చామని, కాంగ్రెస్ సర్కార్ లాగా ఏనాడూ ప్రచారం చేసుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో చేసిన పనులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదన్నారు. జనవరి 30వ తారీఖు నాడు 420 హామీలు ఇచ్చి 420 రోజులు అవుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నేడు తెలంగాణ భవన్‌లో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ… ‘కేసీఆర్ నాయకత్వంలో చేసిన పనులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు 14 నెలలు గడిచినా ఇంకా అబద్ధాలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్ సభలో మాట్లాడుతూ చరిత్రాత్మక కార్యక్రమంకు శ్రీకారం చుడుతున్నాం అన్నారు. రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మక కార్యక్రమమా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు లక్షల యాబై వేల రేషన్ కార్డులు ఇచ్చాము కానీ వీరి లాగా ప్రచారం చేసుకోలేదు’ అని అన్నారు.
Also Read: Indiramma Illu Scheme: ఇందిరమ్మ ఇల్లు రాలేదని రైతు ఆత్మహత్య!
‘డిక్లరేషన్లు ఇచ్చి, బాండ్ పేపర్ల మీద అఫిడవిట్‌లు ఇచ్చి..ఇంటి ఇంటికి గ్యారెంటీ కార్డులు ఇచ్చారు. ఇలా 420 అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. జనవరి 30వ తారీఖు నాడు 420 హామీలు ఇచ్చి 420 రోజులు అవుతుంది. మహాత్మాగాంధీ వర్ధంతి రోజు గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి ఈ ప్రభుత్వం గురించి చెబుదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయాలని పిలుపు ఇస్తున్నాను. ఈ 420 రోజుల్లో 410 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.